నెల్లూరు: తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.5వేల కోట్లు బాకీపడ్డారని ఆరోపించారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ వినియోగించుకుని డబ్బులు ఇవ్వడం లేదన్నారు. 

నెల్లూరు బహిరంగ సభలో మాట్లాడిన చంద్రబాబు ఎన్నిసార్లు అడుగుతున్నా రూ.5వేల కోట్ల రూపాయలు ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ ను ఏమైనా అంటే తెలంగాణ ఫీలింగ్ తెస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

తాను ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది తానేనని మళ్లీ చెప్పుకొచ్చారు. సైబరాబాద్ నిర్మించింది కూడా తానేనని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో తన కృషి ఎంతో ఉందని అలాంటి వ్యక్తిని పట్టుకుని కేసీఆర్ తిడుతున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.