ధర్మపోరాట దీక్షను బీజేపీ, వైసీపీ విమర్శిస్తున్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఢిల్లీ ఏపీభవన్‌లో ఆయన టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు. 17 పార్టీల ప్రతినిధులు పాల్గొన్న ఢిల్లీ ధర్మపోరాట దీక్షను ఫ్లాప్‌షో అంటారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

అన్ని రాష్ట్రాలకు చెందిన నేతలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రధానికి మనం గౌరవం ఇవ్వలేదని.. వైసీపీ నేతలు మాట్లాడటం ఇరు పార్టీల బంధాన్ని బయటపెట్టిందని ఆరోపించారు. బురదపాము లాంటి వైసీపీ.. బీజేపీతో కలిసి కుట్రలు పన్నుతోందన్నారు.

ఆంధ్రాభవన్ జాతీయ రాజకీయాలకు వేదికగా ఉంటుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దేశం గుర్తించిందని, ప్రధాని ఏపీకి చేసిన మోసాన్ని అంతా గుర్తించారని చెప్పారు. బీజేపీ తీరును ఎండగట్టడంలో సోమవారం సఫలమయ్యామన్నారు.

ఇవాళ రాష్ట్రపతిని కలుస్తామని, పోరాటాన్ని ఆపేదిలేదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తుని జగన్ తాకట్టు పెడుతోన్న తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని వెల్లడించారు. మరోవైపు ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం కలవనుంది.

11 మంది ప్రతినిధులతో ఆయన రాష్ట్రపతి వద్దకు వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ 18 డిమాండ్లపై రాష్ట్రపతికి వినతిపత్రం అందించనున్నారు. ఏపీ భవన్ నుంచి పాదయాత్రగా వెళ్లి రాష్ట్రపతిని కలవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.