ఏలూరు: బీజేపీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒక్కసీటు కూడా గెలవదని అభిప్రాయపడ్డారు. జగన్, పవన్ కళ్యాణ్ లను అడ్డుపెట్టుకుని బీజేపీ నాటకాలాడుతుందని దుయ్యబుట్టారు. కేంద్రం సహకరించకపోయినా నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్నిస్వసక్తితో అభివృద్ధి చేసుకున్నామన్నారు. 

మరోవైపు కేంద్రం ఇచ్చిన హామీలలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం బుందేల్ ఖండ్ కు 24 వేల కోట్లు ఇస్తే మన రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేవలం 1000కోట్లు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో రైల్వేజోన్ పై మీనమేషాలు లెక్కేస్తున్నారంటూ మండిపడ్డారు. 

రైల్వే జోన్ ఏర్పాటుపై తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ఒడిస్సా ప్రభుత్వం స్పష్టం చేసినా రైల్వే జోన్ పై ప్రకటన చెయ్యడం లేదన్నారు. అలాగే కడప జిల్లాకు ఉక్కు కర్మాగారంపై కూడా స్పష్టమైన నిర్ణయం ప్రకటించడం లేదన్నారు. అన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తామని చెప్తున్నా కేంద్రం ఉక్కుకర్మాగారం ఏర్పాటుకు సహకరించడం లేదన్నారు.  11 విద్యాసంస్థలు ప్రకటించినా అతీగతీ లేకుండా పోయిందన్నారు. కేంద్రప్రభుత్వం దుర్మార్గం చేస్తారని తెలిసినా భావితరాల కోసం పోరాటం చేస్తున్నానని....తనకు ప్రజల మద్దతు కావాలని కోరారు. 

మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ప్రతీ శుక్రవారం కోర్టులో చేతులు కట్టుకుని నిలబడే వ్యక్తి తనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తనపై తప్పుడు కేసులు పెట్టాలని గతంలో ప్రయత్నించారని కానీ తనను ఎవరు ఏమీ చెయ్యలేకపోయారన్నారు. తాను నిప్పులా బతుకుతున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. 25 సంవత్సరాల కంటే ముందే కుటుంబ పోషణ కోసం నా భార్య చిన్న పరిశ్రమను ఏర్పాటు చేసి దాన్ని అంచెలంచెలుగా పైకి తీసుకువస్తే దానిపై కూడా విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు.