కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తెలుగువారిపై చూపిస్తున్న వివక్ష కారణంగా  తన మనసు క్షోభిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.  గుజరాత్ లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ విగ్రహ ఏర్పాటు సమయంలో అక్కడ ఓ శిలాఫలకంపై అన్ని భాషల్లోనూ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని రాశారు. కాగా.. తెలుగులో మాత్రం ప్రస్తావించలేదు. దీనిపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

‘‘భారత దేశంలో ఎక్కువ మంది మాట్లాడే మూడవ అతి పెద్దదైన తెలుగు భాషకు #StatueOfUnity వద్ద గుర్తింపు లభించక పోవటంతో తెలుగు తల్లి బిడ్డగా నా మనసు క్షోభిస్తోంది. పైసా ఖర్చు లేని ఇటువంటి విషయాలలో కూడా తెలుగు వారంటే ఇంత వివక్షా?ప్రతి తెలుగు వారూ అలోచించి,తమ ఆవేదనను వ్యక్తం చేయవలసిన తరుణమిది’’ అంటూ చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

 

‘‘పార్లమెంట్లో ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చకపోయినా నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి శ్రమిస్తున్నాం. BJP మేనిఫెస్టో తో పాటు ఎన్నికల సభలలో నరేంద్ర మోడీ గారు ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎదురు దాడి చేస్తుంటే భరిస్తున్నాం, సహిస్తున్నాం. లక్ష్యం కోసం పోరాడుతున్నాం.’’ అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.