బాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ జప్తు: ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్
ఉండవల్లి కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ జప్తునకు కోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.
విజయవాడ: ఉండవల్లి కరకట్టపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ జప్తునకు అనుమతివ్వాలని ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. బుధవారం నాడు ఏసీబీ కోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ నెల 14వతేదీన లింగమనేని గెస్ట్ హౌస్ ను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసింది.
టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఇదే గెస్ట్ హౌస్ లో నివాసం ఉంటున్నారు. అమరావతి రాజధాని భూ సేకరణలో అవకతవకలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఆరోపణలు చేస్తుంది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో రాజధాని భూ సేకరణ విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్టుగా వైసీపీ ఆరోపణలు చేసింది. 2019 లో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో తీసుకున్న నిర్ణయాల్లో అవకతవకలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి నివేదిక అందించింది. చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాల్లో అవకతవకలపై ఏపీ సీఐడీ విచారణ నిర్వహిస్తుంది.
రాజధాని భూ సేకరణ సమయంలో కరకట్టపై ఉన్న గెస్ట్ హౌస్ ను మినహయించినందుకు చంద్రబాబుకు లింగమనేని రమేష్ బాబు ఇచ్చారని వైసీపీ ఆరోపణలు చేస్తుంది. చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై ఏపీ సీఐడీ విచారణలో దూకుడును పెంచింది. ఈ క్రమంలోనే లింగమనేని గెస్ట్ హౌస్ జప్తునకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.