విజయవాడ: మాజీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమను విచారణకు రావాల్సిందిగా  సీఐడీ అధికారులు గురువారం నాడు నోటీసులు పంపారు.  ఇవాళ ఉదయం 10:30 గంటలకు విచారణకు రావాలని  నోటీసులు పంపారు.తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి అసెంబ్లీ స్థానంలో టీడీపీ తరపున ప్రచారంలో దేవినేని ఉమ ఇవాళ ప్రచారం నిర్వహిస్తున్నారు. 

ఇవాళ విజయవాడలోని గొల్లపూడిలో దేవినేని ఉమ ఇంటికి సీఐడీ పోలీసులు నోటీసులు అంటించారు. 10 నిమిషాల ముందుగానే ఉమ ఇంటికి నోటీసులు అంటించి కర్నూల్ లో విచారణకు హాజరు కావాలని పిలవడంలో ఆంతర్యం ఏమిటని  టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

తిరుపతిలో  మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం జగన్ చేయని  వ్యాఖ్యలను చేసినట్టుగా దేవినేని ఉమ మీడియా సమావేశంలో తప్పుడు ఆరోపణలు చేశారని  కర్నూల్ కు చెందిన న్యాయవాది నారాయణ రెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు ఉమపై ఐపీసీ 464, 465, 468, 469, 470,471, 505, 120 (బీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  అంతేకాదు సీఆర్‌పీసీ సెక్షన్ 41 ప్రకారంగా విచారణకు రావాలని నోటీసులు పంపారు.