స్కిల్ కేసులో హైకోర్టులో అడిషనల్ అఫిడవిట్ దాఖలు: బాబుపై సీఐడీ కీలక ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీఐడీ దాఖలు చేసిన అడిషనల్ అఫిడవిట్ లో పలు అంశాలను ప్రస్తావించింది. చంద్రబాబుపై సీఐడీ ఆరోపణలు చేసింది.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ సీఐడీ అడిషనల్ అఫిడవిట్ ఫైల్ చేసింది.ఈ అఫిడవిట్ లో పలు కీలక అంశాలను సీఐడీ ప్రస్తావించింది.
సాక్షులు, సహనిందితులను చంద్రబాబు పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారని ఏపీ సీఐడీ అడిషనల్ అఫిడవిట్ లో ఆరోపించింది. స్కిల్ కేసులో సాక్షులపై చంద్రబాబు ఫిర్యాదులు చేయిస్తున్నారని పేర్కొంది. స్కిల్ కేసులో నిధుల దుర్వినియోగంపై ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన శరత్ అసోసియేట్ పై ఐసీఏఐలో తప్పుడు పిటిషన్లు పెట్టిస్తున్నారని ఆఫిడవిట్ లో ప్రస్తావించింది.
స్కిల్ కేసులో ఏ 8 గా ఉన్న వికాస్ తో ఐసీఏఐలో పిటిషన్ ఫైల్ చేశారని ఆరోపించింది.నోట్ల రద్దు సమయంలో రూ. 500, రూ.1000 నోట్ల డిపాజిట్లపై అనుమానాలున్నాయని కూడ అఫిడవిట్ లో పేర్కొంది. టీడీపీ ఖాతాలకు వచ్చిన నిధులపై అనుమానాలున్నాయని సీఐడీ తెలిపింది.
మరోవైపు హైద్రాబాద్ లో నిర్వహించిన ర్యాలీ విషయమై కేసు నమోదైన విషయాన్ని కూడ అడిషనల్ అఫిడవిట్ లో ప్రస్తావించింది. అంతేకాదు చంద్రబాబుపై నమోదైన కేసులను వివరించింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కోరారు. ఆరోగ్య కారణాలతో చంద్రబాబుకు ఈ ఏడాది అక్టోబర్ 31న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుండి విడుదలయ్యారు.
జైలు నుండి విడుదలైన చంద్రబాబునాయుడు హైద్రాబాద్ లో పరీక్షలు చేయించుకున్నారు. ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఎల్ వీ ప్రసాద్ ఆసుపత్రిలో కూడ కుడి కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ విషయమై హైకోర్టుకు ఇవాళ చంద్రబాబు న్యాయవాదులు నివేదికను అందించారు.
also read:సీఐడీ వినతి: ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పై నేడు మధ్యాహ్ననికి విచారణ వాయిదా
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ ముగిసింది. వచ్చే వారంలో ఈ విషయమై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే చంద్రబాబుపై ఏపీ ఫైబర్ నెట్, అంగళ్లు కేసు, ఇసుక విధానంలో అక్రమాలు, మద్యం తయారీ కంపెనీలకు ప్రయోజనం కల్పించారని కేసులు నమోదయ్యాయి.ఈ కేసుల్లో చంద్రబాబు న్యాయస్థానాలను ఆశ్రయించారు.