సీఐడీ వినతి: ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పై నేడు మధ్యాహ్ననికి విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం ఇరు వర్గాల లాయర్లు వాదలను విన్పించనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను బుధవారం నాడు మధ్యాహ్నానికి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇవాళ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేపట్టనున్నట్టుగా హైకోర్టు తెలిపింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. అయితే ఈ విషయమై తమకు కొంత సమయం ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు హైకోర్టును అభ్యర్ధించారు.ఈ అభ్యర్థన మేరకు ఇవాళ మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత ఈ పిటిషన్ పై విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.
చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు మధ్యాహ్నం వరకు సమయం కావాలని సీఐడీ న్యాయవాదులు కోరిన మీదట హైకోర్టు అంగీకరించింది.
ఈ నెల 10వ తేదీన ఈ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది.అయితే సీఐడీ తరపు న్యాయవాది వినతి మేరకు ఈ పిటిషన్ పై విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. గత విచారణ సమయంలో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అందుబాటులో లేనందను వాయిదా వేయాలని సీఐడీ తరపు న్యాయవాది కోరారు. దీంతో ఏపీ హైకోర్టు ఈ వినతి మేరకు విచారణను వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడికి ఆరోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు ఈ ఏడాది అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 28వ తేదీ వరకు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ గడువు ఉంది.
ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబునాయుడిని ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు స్కిల్ కేసులో అరెస్ట్ చేశారు. సుమారు 53 రోజుల తర్వాత మధ్యంతర బెయిల్ రావడంతో రాజమండ్రి జైలు నుండి విడుదలయ్యారు.