హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు వేసే వేషాలు మామూలుగా ఉండవు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విచిత్ర వేషధారణలతో పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నికలవేళ రాజకీయ నాయకులు చేసే సిత్రాలు మామూలుగా ఉండవు. ఓ రేంజ్ లో ఉంటాయి. 

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు వేస్తున్న వేషాలు అదరహో అనిపిస్తున్నాయి. ఈ కోవలోకి తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చి చేరారు. 
కొద్దిరోజులుగా చంద్రబాబు నాయుడు రకరకాల అవతారాలు ఎత్తుతూ చర్చనీయాంశంగా మారారు. 

ఇటీవల అనంతపురం జిల్లాలో కియా కంపెనీకి సంబంధించి మెుదటి కారు విడుదల అయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు స్వయంగా కియా కారును నడుపుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. తాను ఏపీని ఇండస్ట్రీయల్ హబ్ చేస్తానని అలాగే చేశానని తెలిపారు. ఇకపై ఇండస్ట్రీయల్ హబ్ ను నెలకొల్పేందుకు డ్రైవర్ లా పనిచేస్తానని చెప్పుకొచ్చారు.

మరోవైపు ఫిబ్రవరి ఒకటిన సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వం తీరును నిరసిస్తూ అసెంబ్లీకి బ్లాక్ షర్ట్ ధరించి వచ్చారు. అసెంబ్లీలో నల్లచొక్కాతో బీజేపీని కడిగిపారేసిన చంద్రబాబు ఢిల్లీ వరకు అదే షర్ట్ తో వెళ్లారు. బీజేపీయేతర పార్టీల సమావేశంలోనూ నల్ల షర్ట్ ధరించి జాతీయ స్థాయిలో తన నిరసనపై చర్చ జరిగేలా చేశారు చంద్రబాబు.

ఈ షర్ట్ చూసిన పలువురు మరో కాలా అంటూ అభివర్ణించారు. మరోవైపు శనివారం చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ లు వేసుకునే చొక్కా వేసుకుని ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు చంద్రబాబు నాయుడు. ఆటోలపై లైఫ్ ట్యాక్స్ ఎత్తివేస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

దీంతో పలు ఆటో సంఘాల నేతలు చంద్రబాబు నాయుడును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆటో డ్రైవర్ చొక్కా వేసుకుని ఆటోనడుపుతూ నేను మీలానే ఆటోడ్రైవర్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రయాణికుల సంక్షేమం మీరు చూసుకోండి మీ సంక్షేమం నేను చూసుకుంటా అంటూ చంద్రబాబు నాయుడు వారికి భరోసా ఇచ్చారు.

ఇంధన భారం తగ్గేలా, భీమాపై ప్రత్యేక చర్యలు తీసుకుంటానని వారికి హామీ ఇచ్చారు.  చంద్రబాబు నాయుడు  అవతారాలు చూస్తుంటే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయినట్లు ఉన్నారని గుసగుసలాడుకుంటున్నారు. 

మెున్న కియా కారు విడుదల సందర్భంగా కారు నడిపి ఐటీ హబ్ ని నడుపుతున్నట్లు చంద్రబాబు ప్రజలకు తెలియజేశారు. నిన్న కాలాని తలపించేలా బ్లాక్ షర్ట్ ధరించడం, ఆటో డ్రైవర్ల ఓట్లను కొల్లగొట్టేందుకు ఆటో డ్రైవర్ గా అవతారం ఎత్తడం ఇక ఎలక్షన్ కోడ్ వస్తే ఇంకెన్నీ సిత్రాలు చూడాలో అంటూ పలువురు గుసగుసలు ఆడుకుంటున్నారు.