అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది రంగం సిద్ధం చేశారు. 

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వీవీప్యాడ్ స్లిప్పులు బయట లభించడంపై ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులలో నిర్లక్ష్యం వహించిన ఆర్వో, ఏఆర్వోలపై సస్పెన్షన్ వేటు వేశారు. మరోవైపు రాష్ట్రంలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు గోపాలకృష్ణ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు. 

గుంటూరు జిల్లాలో రెండు పోలింగ్ బూత్ లలో, నెల్లూరు జిల్లాలో రెండు పోలింగ్ బూత్ లలో, ప్రకాశం జిల్లాలో ఒక పోలింగ్ బూత్ లో రీ పోలింగ్ నిర్వహించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు. అలాగే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల తరలింపుపై సమాచారం సేకరించారు సిఈవో. 

వారిపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐదు పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ పై మంగళవారం రాత్రికి లేదా బుధవారం సిఈసీ తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.