Asianet News TeluguAsianet News Telugu

12 గంటలకే ట్రెండ్స్ తెలిసిపోతాయ్: సిఈవో గోపాలకృష్ణ ద్వివేది

మధ్యాహ్నం 2 గంటల వరకు చాలా వరకు ఫలితాలు తెలిసిపోయే అవకాశం ఉందన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల్ని లెక్కించాక బహుశా రాత్రి వరకు ఈసీఐ అనుమతి తీసుకొని ఫలితాన్ని ప్రకటిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 
 

ap ceo gopala krishna dwivedi comments on counting arrangements
Author
Amaravathi, First Published May 22, 2019, 7:37 PM IST

అమరావతి: ఓట్ల లెక్కింపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకాగానే తొలుత పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్లు లెక్కించి ఉదయం 8.30 గంటలకు ఈవీఎంల లెక్కింపు చేపడతామని స్పష్టం చేశారు. 

మధ్యాహ్నం 12గంటల లోపు ఫలితాల ట్రెండ్స్‌ తెలిసిపోతాయన్నారు. ఈవీఎంల కౌంటింగ్ అనంతరం వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు తర్వాతే ఫలితం ప్రకటిస్తామని తెలిపారు. ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కిస్తామని చెప్పుకొచ్చారు. 

36 కౌంటింగ్‌ కేంద్రాల్లో సుమారు 350 లెక్కింపు హాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి అసెంబ్లీ స్థానానికి ఒక పరిశీలకుడు, పార్లమెంట్‌ స్థానానికి మరో పరిశీలకుడు ఉంటారని తెలిపారు. రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల ఆధ్వర్యంలో లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. 

కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, రిటర్నింగ్‌ అధికారులు, పరిశీలకులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి అన్ని ఏర్పాట్లపై ఆరా తీసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలించేందుకు ఈసీఐ నుంచి ఇద్దరు పరిశీలకు రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు. 

వారి సూచనలు, సలహాలు ఇస్తూ మానిటరింగ్ చేశారని ద్వివేదీ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరినీ తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపుతామని తెలిపారు. 

కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరం నుంచి వాహనాలను అనుమతించరని స్పష్టం చేశారు. చివరి అంచెలో సీపీఎంఎఫ్‌ బలగాలను పెడతామని తెలిపారు. ఈ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మొత్తం 25వేల మంది పోలీసు బలగాలను మోహరిస్తున్నట్లు తెలిపారు. 

అలాగే 35 కంపెనీల సీపీఎంఎఫ్‌ బలగాలు, పది కంపెనీల బలగాలను కేంద్రం పంపిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించేది లేదని తెలిపారు. బయట ఏర్పాటుచేసే కౌంటర్లలోనే ఫోన్లు ఉంచుకోవాలని సూచించారు. ఆర్వోలు, కౌంటింగ్‌ ఏజెంట్లు, సూపర్‌వైజర్లందరికీ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. 

ప్రతి కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద ఇద్దరు బెల్‌ ఇంజినీర్లు ఉంటారని ఈవీఎంలలో ఏమైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే వారు వెంటనే వాటిని రెక్టిఫై చేస్తారని తెలిపారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓట్లు లెక్కిస్తామని తెలిపారు. 

3లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు, 28వేల సర్వీస్‌ ఓట్లు జారీచేశామని ఉదయం 8.30గంటలకు ఈవీఎంల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఇ-సువిధ యాప్‌, ఈసీఐ వెబ్‌సైట్‌లో ఫలితాలు చూడవచ్చన్నారు. ఓట్ల లెక్కింపులో 25వేల మంది సిబ్బందిని వినియోగిచినట్లు ద్వివేది స్పష్టం చేశారు.  

వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కింపు తర్వాత తుది ఫలితం ప్రకటిస్తామన్న ఆయన స్లిప్పుల లెక్కింపు కోసం వీవీప్యాట్లను లాటరీ తీసి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాలకు వేర్వేరుగా ఎంపిక చేస్తామన్నారు. ఈవీఎంలో సాంకేతిక సమస్యలు ఉంటే వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కిస్తామని స్పష్టం చేశారు. 

మధ్యాహ్నం 2 గంటల వరకు చాలా వరకు ఫలితాలు తెలిసిపోయే అవకాశం ఉందన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల్ని లెక్కించాక బహుశా రాత్రి వరకు ఈసీఐ అనుమతి తీసుకొని ఫలితాన్ని ప్రకటిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 

చాలా పారదర్శకంగా, పక్కాగా అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. కచ్చితంగా ఎలాంటి సమస్యలు లేకుండా కౌంటింగ్‌ను పూర్తిచేస్తామని సిఈవో గోపాలకృష్ణ ద్వివేది ధీమా వ్యక్తం చేశారు.    

Follow Us:
Download App:
  • android
  • ios