అమరావతి: అమరావతి ఇక ఎంత మాత్రమూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండబోదనేది అర్థమవుతోంది. భారతదేశ చిత్రపటంలో ఏపీ రాజధానికి చోటు లేకుండా పోయింది. అమరావతి నుంచి రాజధానిని తరలించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యూహం వల్లనే అది జరిగిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 

రాజధానిని వేరే ప్రాంతానికి తరలించడం దాదాపుగా ఖాయమైనట్లు చెబుతున్నారు. ఏపీ రాజధానిపై వైఎస్ జగన్ ప్రభుత్వం కమిటీని వేసింది. ఆ కమిటీ త్వరలో తన నివేదికు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అందించనుంది. జగన్ ఆలోచనలకు అనుగుణంగానే ఆ కమిటీ నివేదిక ఉండవచ్చునని ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం వెలగపూడిలో ఉన్న సచివాలయాన్ని, శాసనసభను మంగళగిరికి తరలించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. హైకోర్టుకు మాత్రం కర్నూలుకు తరలిస్తారని చెబుతున్నారు. ప్రభుత్వ సంస్థలను వివిధ ప్రాంతాల్లో నెలకొల్పి అధికార వికేంద్రీకరణ చేయాలనే జగన్ ఆలోచనలో భాగంగానే అదంతా జరుగుతుందని చెబుతున్నారు. అందులో భాగంగానే అమరావతిలో నిర్మాణం పనులన్నీ ఆగిపోయాయని అంటున్నారు.

ఏపి రాజధానిని దోమకొండకు తరలిస్తారనే ప్రచారం కూడా సాగింది. అయితే, అందుకు విరుద్ధంగా రాజధానిని మంగళగిరిలో పెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ రాజధానిపై నెలకొన్న వివాదానికి జగన్ త్వరలోనే తెర దించాలని భావిస్తున్నారు.