అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం గురువారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్ధానికి సబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆలయంలో తలుపులు తెరిచే సన్నిధి గొల్లలకు వారసత్వ హక్కు కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయంపై తాజాగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందించారు. 

 టీటీడీ దేవాలయంలో సన్నిధి గొల్లకు వారసత్వ హక్కు కల్పిస్తూ జగనన్న ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి అన్నారు. ఈ నిర్ణయంతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో వైయస్ జగన్ మరో అడుగు ముందుకేశారని అన్నారు. శ్రీవారిని ప్రతి నిత్యం ముందుగా దర్శించుకునే భాగ్యం సన్నిధి గొల్ల కుటుంబ సభ్యుడిదేనని... ఇక నుంచి సన్నిధి గొల్ల కుటుంబ సభ్యులకు ఇది హక్కుగా మారిందన్నారు. 

తరతరాలుగా శ్రీవారి ఆలయ ద్వారాలను తెరిచేది సన్నిధి గొల్ల కుటుంబీకులేనని మంత్రి అన్నారు. శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం సుప్రభాత సేవకు అర్చకులను తోడ్కొని వచ్చేది సన్నిధి గొల్ల కుటుంబీకులేనని... వంశపారపర్యంగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని(మిరాసీ విధానాన్ని)  1996లో రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తుచేశారు. 

read more   హెరిటెజ్‌ మజ్జిగపై సీబీఐ విచారణ: ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాళహస్తి పాదయాత్రలో తనను కలిసిన సన్నిధి గొల్లలకు ఇచ్చిన హామీ మేరకు వారసత్వ హక్కులను పునరద్దరిస్తామని మేనిఫెస్టో చేర్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం జగనన్నకే చెల్లిందని...  ఇందులో భాగంగానే సన్నిధి గొల్లలకు ఇచ్చిన హామీనీ నెరవేర్చారని అన్నారు. 

''అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలో ప్రతి కార్యక్రమం సంప్రదాయాలకు అనుగుణంగానే నిర్వహిస్తారు.ఇప్పటికీ పురాతన కాలంలో నిర్దేశించిన విధంగానే స్వామివారి ఆలయంలో పూజా కైంకర్యాల నిర్వహణ జరుగుతుంది. ఆలయ పూజా కైంకర్యాలకు సంబంధించి అర్చకులు, జియ్యంగర్లు, ఆచార్య పురుషులు, అన్నమాచార్య వంశీకులతో పాటు సన్నిధి గొల్ల కుటుంబం పాత్ర ప్రతి నిత్యం ఉంటుంది. కాబట్టి వైయస్సార్సీపి ప్రభుత్వం సన్నిధి గొల్లకు వారసత్వ హక్కు కలిపిస్తూ తీసుకున్న క్యాబినెట్ నిర్ణయంపై చరిత్రలో నిలిచిపోతుంది'' అని మంత్రి వెల్లంపల్లి అన్నారు.