అమరావతి:  ఈ ఏడాది వైద్య ఆరోగ్యశాఖలో  9700 మంది ఆరోగ్య సిబ్బందిని నియమించనున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి గాను 2020-21 బడ్జెట్‌లో రూ.11.419.44 కోట్లను కేటాయించింది.

మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీలో ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. రాష్ట్రాన్నిచదువుల బడిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా  మంత్రి ప్రకటించారు.

డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరింపజేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న1059 ఆరోగ్య విధానాలతో పాటు మరో 1000 ప్రాథమిక ఆరోగ్య విధానాలను కూడ జతచేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది.

ఈ ఏడాది  జనవరి నుండి ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల స్మార్ట్ కార్డులను పంపిణీని ప్రారంభించినట్టుగా మంత్రి తెలిపారు. దాదాపుగా కోటి 42 లక్షలకు కార్డులను పంపిణీ చేశామన్నారు.డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద రూ. 225లను ఆపరేషన్ చేసుకొన్న తర్వాత కూడ అందిస్తామని బడ్జెట్ లో ప్రభుత్వం ప్రకటించింది.

ALSO READ:విద్యాశాఖకు బడ్జెట్‌లో పెద్దపీట: విద్యార్థులకు మూడు జతల యూనిఫారాలు

తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 130 ఆసుపత్రుల్లో కూడ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నట్టుగా  మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మొదటి విడతగా కంటి వెలుగు కింద 69 లక్షల మంది విద్యార్థులకు రెండో విడతగా 4.60 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్టుగా మంత్రి చెప్పారు. 

ప్రతి మండలానికి 108 అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 439 అంబులెన్స్ లతో పాటు 292 సంచార వైద్య వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా తెలిపారు.ఈ ఏడాది వెయ్యి 108  అంబులెన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. 108, 104 సేవలకు ఈ బడ్జెట్లో రూ. 470.29 కోట్లు ప్రతిపాదిస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

వైద్య, ఆరోగ్య శాఖలో నాడు నేడు కింద సబ్ సెంటర్ల నుండి టీచింగ్ హాస్పిటల్స్ వరకు మౌళిక వసతులు కల్పిస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. గ్రామ, వార్డు స్థాయిలో 11 వేలకు పైగా డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లను నెలకొల్పుతున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రంలో 1145 పీహెచ్‌సీలు, 195 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 28 ప్రాంతీయ వైద్య శాలలు, 13 జిల్లా ఆసుపత్రులు, 11 బోధనాఆసుపత్రుల్లో మౌళిక వసతులను ఆధునీకరించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.