ఏపీ ప్రభుత్వం ఆరు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. మంగళవారం ఏపీ శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రూ.2,26,177.53కోట్లతో ఈ బడ్జెట్ ని రూపొందించారు. కాగా.. ఈ బడ్జెట్ లో ప్రభుత్వం ప్రజల కోసం ఆరు నూతన పథకాలను ప్రవేశపెడుతూ.. నిధులను మంజూరు చేసింది. ఆ పథకాలు ఏంటో.. ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించారో ఇప్పుడు చూద్దాం...

1.అన్నదాత సుఖీభవ..
రైతాంగాన్ని ఆదుకొనేందుకు అన్నదాత సుఖీభవ అనే పేరుతో కొత్త స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నట్టు యనమల రామకృష్ణుడు తన బడ్జెట్‌లో ప్రసంగంలో స్పష్టం చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈ పథకం కింద రూ.5 వేల కోట్లను కేటాయించారు.
పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీని పెంచి రాయితీలను రూ.10 వేల నుండి రూ15 వేలకు పెంచినట్లు ప్రకటించారు. మొక్కజొన్నకు రూ.8 వేల నుండి రూ12 వేలకు, పప్పుధాన్యాలు, పొద్దుతిరుగుడు పంటలకు రూ. 6 వేల నుండి 10వేలకు పెంచారు.

2.క్షత్రియ కార్పొరేషన్..
బడ్జెట్ లో వెనుకబడిన తరగతుల వారితోపాటు  క్షత్రియులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్ కింద రూ.50కోట్లు కేటయించారు. 

3.హౌస్ సైట్స్ భూ సేకరణ పథకం..
నిరుపేదలకు గృహ వసతి కల్పించేందుకు గాను.. అవసరమైన కాలనీలు నిర్మించేందుకు ఇళ్ల సేకరణ పనుల దృష్ట్యా రూ.500 కోట్లను కేటాయించారు. 

4.డ్రైవర్స్ సాధికార సంస్థ..
ప్రభుత్వేతర రంగాల్లో ఉన్న డ్రైవర్ల సంక్షేమానికి ఈ సారి బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. డ్రైవర్ల సాధికారిక సంస్థను ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన యనమల రూ. 150 కోట్లను కేటాయించారు.

5. మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పన..
మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కోసం కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఈ పథకం కింద రూ.100కోట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టనున్నారు.

6. నిరుధ్యోగ భృతి

నిరుద్యోగుల కోసం నెలసరి ఆదాయం అందించేలా చేపట్టిన పథకమే ఈ నిరుద్యోగ భృతి. ఇప్పటి వరకు నెలకు రూ.వెయ్యి ఇస్తుండగా.. ఇప్పటి నుంచి రూ.2వేలు ఇవ్వనున్నారు.