మంత్రి ఆదిమూలపు సురేశ్ యర్రగొండపాలెంలో చొక్కా విప్పి సవాల్ చేయడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఇవాళ చొక్కా విప్పుతారు.. రేపు మరొకరు ప్యాంట్ విప్పుతారు.. ఇంకొకరు మరేదో విప్పుతారు.. అంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు అన్నారు. జగన్ ఈ అతిని అడ్డుకోవాలని కోరారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజ్ అధికార వైసీపీ పై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు దిగజారుడు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ యర్రగొండపాలెంలో చొక్కా విప్పి సవాల్ చేయడాన్ని తప్పుపట్టారు. అది అనాగరిక చర్య అని విమర్శించారు. విశాఖలో ఆయన విలేకరులతో శనివారం మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతల తీరు దారుణంగా ఉన్నదని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు అన్నారు. వారి అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డిని మెప్పించడానికి వారు దిగజారుతున్నారని ఆరోపించారు. యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ చొక్కా విప్పి సవాల్ చేయడం తప్పని అన్నారు. ఇవాళ ఆయన చొక్కా విప్పారని.. రేపు ఇంకొకరు ప్యాంట్ విప్పుతారని అన్నారు. ఆ తర్వాత వేరొకరు ఇంకోటి విప్పుతారని పేర్కొన్నారు. ఈ విప్పడాలకు జగన్ అడ్డుకట్ట వేయాలని సూచించారు.
ఇదే సమయంలో పొత్తు కట్టడానికి ససేమిరా అంటున్న పార్టీ టీడీపీ చీఫ్ చంద్రబాబు పై రాళ్ల దాడి చేయడాన్ని బీజేపీ ఖండించింది. చంద్రబాబు పై రాళ్ల దాడిని ఖండిస్తున్నామని విష్ణు కుమార్ రాజు తెలిపారు. ఈ చర్యను ప్రతి పార్టీ ఖండించాలని అన్నారు.
Also Read: నేడు కర్ణాటకు రాహుల్ గాంధీ.. ఎన్నికల రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన
సీఎం జగన్ పేరు చెప్పి అధికార పార్టీ నేతలు రాష్ట్రంలో దోచుకుంటున్నారని విష్ణు కుమార్ రాజు ఆరోపణలు చేశారు. టిడ్కో ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో ఆ పనులు పూర్తవడం లేదని అన్నారు. తన బాబయ్ వివేకాను హత్య చేసిన వారిని ఊచల వెనక్కి పంపాలనే ఉద్దేశం జగన్ మోహన్ రెడ్డికి అసలు ఉన్నదా? లేదా? అని అడిగారు.
