పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలను నిరసిస్తూ ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు శనివారం నెల్లూరు జిల్లా గూడురులో మెరుపు ధర్నా నిర్వహించారు. ఇటీవల ముగిసిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంపై ఆయన మండిపడ్డారు. 

ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. అధికార పార్టీ దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి సహకారం చేయకపోగా వారిపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.

దీనిని బీజేపీ చూస్తూ ఊరుకోదని సోము వీర్రాజు హెచ్చరించారు. గతేడాది ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో కూడా కిడ్నాప్‌లు, దాడులు చేయడంతో పాటు మహిళా నాయకురాలి చేయి విరగ్గొట్టారని ఆయన ఆరోపించారు.

అధికార పార్టీ దౌర్జన్యాలకు బీజేపీ తప్పక సరైన సమాధానం ఇస్తోందని  వీర్రాజు హెచ్చరించారు. ఈ విషయం  జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. బీజేపీ నేతలపై పెట్టిన అక్రమకేసులు ఎత్తేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు.