అమరావతి: తిరుపతి లోకసభ ఉప ఎన్నిక నేపథ్యంలో బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యం చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబును మరోమారు ఆయన ఎత్తిపొడిచారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి గతంలో చేసిన వ్యాఖ్యలను ఇంతకు సోము వీర్రాజు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఆయన ప్రత్యేక హోదాను వదులుకుంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సోము వీర్రాజు ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం ప్రతిపాదనకు అనుకూలంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తన ట్వీట్ లో ఎత్తిచూపారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే.

ప్రత్యేక హోదా కావాలంటున్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి ధీటుగా సమాధానం ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఆ వ్యాఖ్యకు సోము వీర్రాజు వీడియోను జత చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రామ్మోహన్ నాయుడు పార్లమెంటులో కేంద్రాన్ని కోరారు. ప్రత్యేక హోదా వల్ల ఏం వస్తుంది, హిమాచల్ ప్రదేశ్ కు ఏం వచ్చిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వీడియోను సోము వీర్రాజు చూపించారు. 

 

తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో టీడీపీ తరఫున పనబాక లక్ష్మి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ తరఫున గురుమూర్తి, కాంగ్రెసు తరఫున చింతా మోహన్ పోటీ చేస్తున్నారు. బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభ పోటీ చేస్తున్నారు.