ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరు ఎంతమాత్రం ఆదర్శనీయం కాదన్నారు బీజేపీ నేత, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ . బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

వైసిపి ప్రభుత్వ పనితీరును, అవినీతిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. బిజెపిపై విశ్వాసం పెంచేలా పార్టీ శ్రేణులు పని చేయాలన్నారు.

ఏపీకి ప్రధానమంత్రి మోదీ ఎన్నో నిధులను మంజూరు చేశారని రమణ్ సింగ్ తెలిపారు. కేంద్రం అమలు ప్రత్యేక అభివృద్ధి పథకాల ప్రజలకు వివరించాలని.. జనం తో కలిసి కార్యక్రమాలు చేస్తూ, పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. 

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్దిలోకి  తీసుకు వెళ్లేలా కేంద్రం సహకరిస్తుందని స్పష్టం చేశారు. అవినీతి రహిత పరిపాలన కోసం బీజేపీ రావాలని అందరూ కోరుకుంటున్నారని,  కుటుంబ పరిపాలన వ్యవస్థను సమూలంగా వ్యతిరేకించాలని కోరారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు లేకుండా పని చేస్తోందని ఆయన ఆరోపించారు. అభివృద్ధి మాట దేవుడెరుగు.. అవినీతిలో మాత్రం ఏపీ పరుగు తీస్తోందని వీర్రాజు ఎద్దేవా చేశారు.

టీటీడీ విషయంలో, ఎండోమెంట్‌ ల్యాండ్స్‌‌కు సంబంధించి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును బీజేపీ ఖండిస్తోందని ఆయన స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి నిధులను కూడా ప్రభుత్వ ఖాతాలో కలపడం కరెక్టు కాదని సోము వీర్రాజు పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల్లోని స్వామి వారి ఆస్తులను వేలం వేయడం లాంటి వాటిని బిజెపి ఎన్నటికీ సమర్థించదని ఆయన తేల్చి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని వీర్రాజు జోస్యం చెప్పారు.