ఏలూరు: ఆంధప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై రాజకీయ నీడలు కమ్ముకున్నాయని ఆరోపించారు మాజీమంత్రి, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ. పోలవరం ప్రాజెక్టు ఏపీ వాసులకు గుండెకాయలాంటిదని స్పష్టం చేశారు. 

పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన కన్నా లక్ష్మీనారాయణ ఏలూరులో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం ప్రాజెక్టు గుండె లాంటిదని స్పష్టం చేశారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ముంపు ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రంలో కలిపారని చెప్పుకొచ్చారు. 

పోలవరం ప్రాజెక్టులాంటి గొప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి నూటికి నూరు శాతం నిధులు ఇచ్చి పూర్తి చేస్తామని కేంద్రప్రభుత్వం ముందుకు వచ్చినా గత ప్రభఉత్వం పట్టించుకోలేదని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని కేవలం పర్యాటక కేంద్రంగా చూసిందే తప్ప సీరియస్ గా ప్రాజెక్టుపై దృష్టి సారించలేదన్నారు. 

ఈ సందర్భంగా ఏపీ సీఎం వైయస్ జగన్ పైనా సెటైర్లు వేశారు కన్నా లక్ష్మీనారాయణ. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్నా ఎక్కడా అవినీతి అనేది బయటకు తీయలేకపోయిందని విమర్శించారు. 

పలు కీలక ప్రాజెక్టుల్లో పరిస్థితి అతీగతీ లేకుండా పోయిందన్నారు. పోలవరంలో అవినీతిని నిరూపించి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లి ఉంటే బాగుండేదని కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. 

పోలవరంలో అవినీతి ఎక్కడ జరిగిందో కనిపెట్టడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కన్నా ధ్వజమెత్తారు. ప్రాజెక్టును పరిశీలించి పూర్తి స్థాయి నివేదికను ఈనెల 13న జలవనరుల శాఖ మంత్రికి అందజేయనున్నట్లు తెలిపారు. 

సాయంత్రం 6 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి ఒక నివేదిక అందజేస్తామని స్పష్టం చేశారు. పోలవరం పురోగతి, అవినీతి ఆరోపణలపై పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రివర్స్ టెండరింగ్ వల్ల లాభమో, నష్టమో అనేది ఫైనల్ బిల్ వచ్చే వరకు తేలదన్నారు. అంతేగానీ అప్పటి వరకు రివర్స్ టెండరింగ్ పై క్లారిటీ ఏంటో అనేది తేలుతుందన్నారు కన్నా లక్ష్మీనారాయణ. 

ఏపీ ప్రజల కోరిక అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ లక్ష్యమన్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. ఇకపోతే జగన్ ప్రభుత్వం పోలవరం అవినీతిని బూచిగా చూపించి కావాల్సిన పనులు చేయించుకుంటుందని ఆరోపించారు కన్నా లక్ష్మీనారాయణ.