ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. గురువారం కొత్తూరు తాడేపల్లి గోసంరక్షణ కేంద్రంలో ప్రత్యేక పూజలో  పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రివర్స్ టెండరింగ్ విషయంలో కేంద్రం సూచనలను జగన్ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు.

తాజాగా కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ నిర్ణయాలు తప్పని తేలిపోయిందని... లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. కనీసం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దృష్టికి కూడా  జగన్ ఏ విషయాలు తీసుకెళ్లలేదని కన్నా విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిదని కన్నా హితవు పలికారు.

చంద్రబాబు  అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే ప్రస్తుతం జగన్ చేస్తున్నారని.. ప్రాజెక్ట్‌ల విషయంలో ఏకపక్షంగా వెళ్లొద్దని మొదట్నుంచీ చెబుతున్నామని.. న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని చెప్పినా జగన్మోహన్ రెడ్డి  పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వారు చేసిన తప్పును ధైర్యంగా  చెప్పలేక... కేంద్రంపై నెట్టడం సరికాదని కన్నా అభిప్రాయపడ్డారు.