జగన్‌ది ఆత్రమే తప్ప... పనితీరు లేదు: మూడు రాజధానులపై కన్నా వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు పెడతామన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఏపీ బీజేపీ స్వాగతించింది.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు పెడతామన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఏపీ బీజేపీ స్వాగతించింది. అమరావతిలో సీడ్ క్యాపిటల్, కర్నూలులో హైకోర్టు ఉండాలన్నదే బీజేపీ అజెండా అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.
కర్నూలులో హైకోర్టు పెట్టినా అమరావతిలో బెంచ్ ఉండాలని ఆయన సూచించారు. జగన్ ఆలోచలన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదని అదే సమయంలో పరిపాలనా వికేంద్రీకరణ అసాధ్యమని కన్నా అభిప్రాయపడ్డారు.
Also Read:ఏపీకి మూడు రాజధానులు వచ్చే ఛాన్స్: అసెంబ్లీలో జగన్
అధికార వికేంద్రీకరణ అంశాన్ని బీజేపీ మేనిఫెస్టోలో సైతం పెట్టామని ఆయన గుర్తుచేశారు. భూ దాహంతోనే... చంద్రబాబు వేల ఎకరాలు తీసుకున్నారని లక్ష్మీనారాయణ ఆరోపించారు.
జగన్ తన ఆలోచన మాత్రమే చెప్పారని.. సీఎం ప్రకటన అయోమయంగా ఉందని, క్లారిటీ లేదని కన్నా అభిప్రాయపడ్డారు. హైకోర్టు కర్నూలులోనే పెట్టాలని తాము మేనిఫెస్టోలో పెట్టామని లక్ష్మీనారాయణ గుర్తుచేశారు. జగన్ పాలన చూస్తుంటే అభివృద్ధి జరుగుతుందన్న ఆస్కారం కనిపించడం లేదన్నారు.
ముఖ్యమంత్రి మాటలు చెబుతున్నారు.. జీవోలు ఇస్తున్నారని, మాటలకు.. జీవోలకు చాలా తేడా కనిపిస్తుందని కన్నా ఆరోపించారు. ప్రభుత్వంలో ఆత్రం ఎక్కువ కనబడుతోందని.. పనితీరు మాత్రం ఎక్కడా కనిపించడం లేదని లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు.
మంగళవారం అమరావతిపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రసంగించిన జగన్ .. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం వుందన్నారు. ఈ క్రమంలో అమరావతిలో చట్టసభలు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు వచ్చే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.
దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్న సంగతిని జగన్ గుర్తుచేశారు. పాలన దగ్గర, జూడీషియల్ ఒక దగ్గర ఉండే అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదిక ఇస్తుందని దీని ఆధారంగా ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
Also Read:అమరావతిలో టీడీపీ నేతల ఆస్తుల చిట్టా ఇదే
40 ఏళ్ల అనుభవం వున్న చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఏం చేశారని జగన్ ప్రశ్నించారు. విశాఖలో అన్ని వున్నాయని.. ఒక మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మిస్తే సరిపోతుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా రెండు సంస్థలకు బాధ్యతలు అప్పగించామన్నారు.