గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. జగన్ మీరు మరో స్టిక్కర్ సీఎం కాకండి అంటూ హితవు పలికారు.

మ్యానిఫెస్టోలో రైతులకు రూ.12500 ఇస్తానని జగన్ ప్రకటించారని కన్నా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ రైతులకు అందజేసే రూ.6000 కలిపి వైయస్ఆర్ రైతు భరోసా కింద అందజేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. 

ప్రధాని నరేంద్రమోదీ ఇస్తున్న 6 వేలు కలిపి రైతులకు అందజేస్తున్న తరుణంలో వైయస్ఆర్ రైతు భరోసాకు మీరు స్టికర్ వేయడం తప్పు అని చెప్పుకొచ్చారు. వైయస్ఆర్ రైతు భరోసాకు మోదీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. 

గతంలో చంద్రబాబు కూడా ఇలానే వ్యహరించారని ఆరోపించారు. కేంద్రప్రభుత్వ పథకాలను సైతం రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా ప్రకటించుకున్నారని ఆరోపించారు. కానీ స్టిక్కర్ మాత్రం చంద్రబాబుది ఉండేదని చెప్పుకొచ్చారు. అలాంటి స్టిక్కర్ వేసి మరో స్టిక్కర్ ముఖ్యమంత్రిలా మారొద్దంటూ జగన్ ను సూచించారు.