జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించిన మచిలీపట్నం ఆవిర్భావ సభలో ఆయన వ్యాఖ్యలు, ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో ఆ పార్టీ పొత్తుకు బీటలు వారినట్లే కనిపిస్తోంది. బీజేపీ నేతలు సోము వీర్రాజు, మాధవ్‌లు చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ- జనసేన మధ్య పొత్తుకు బీటలు వారినట్లేనని నిపుణులు అంటున్నారు. నిన్న బీజేపీ నేత మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేయగా.. ఇవాళ ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం పరోక్షంగా పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారు. తమ అభ్యర్ధులకు జనసేన నుంచి అందిన సహకారం ఎంత అనేది ఆలోచించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ బాగా పనిచేస్తారు కానీ.. ఏపీలో మాత్రం బీజేపీ ఎదగకూడదనే అందరూ మాట్లాడుతున్నారని సోము వీర్రాజు అన్నారు. 

ఇక నిన్న మాధవ్ మాట్లాడుతూ.. జనసేనతో పొత్తు వున్నా లేనట్లే వున్నామన్నారు . ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమతో జనసేన కలిసి రాలేదన్నారు. అయినాసరే గతం కంటే తమ ఓట్ల శాతం పెరిగిందని మాధవ్ అన్నారు. పవన్ తమతో కలిసి రావడం లేదనేదే తమ ఆరోపణ అంటూ ఆయన కామెంట్ చేశారు. పొత్తుల విషయంలో అనేక ఆలోచనలు వున్నాయని.. కానీ తాము మాత్రం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టామని మాధవ్ స్పష్టం చేశారు. జనసేనతో కలిసి బీజేపీ ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు వుందని ప్రజలు నమ్ముతారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాల్సిందిగా తాము పవన్‌ని కోరామని.. ఆయనే స్పందించలేదని మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Also Read: పేరుకే పొత్తు.. కలిసి లేం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ మద్ధతివ్వలేదు : జనసేన-బీజేపీ బంధంపై మాధవ్ వ్యాఖ్యలు

జనసేన వైసీపీని ఓడించమని చెప్పింది కానీ, బీజేపీని గెలిపించమని చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీల అధ్యక్షులు కలిసే వున్నామని చెబుతున్నా.. కార్యకర్తలు మాత్రం కలిసిలేరని మాధవ్ స్పష్టం చేశారు. కలిసి కార్యక్రమాలు చేద్దామని.. అప్పుడే పొత్తు వుందని మాకూ తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా కలిసి కార్యక్రమాలు చేయాల్సి వుందన్నారు. పొత్తుల గురించి హైకమాండ్ చూసుకుంటుందని.. తాము వైసీపీతో వున్నామన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరని మాధవ్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంతో మే నెలలో ఛార్జ్‌షీట్ వేస్తామని ఆయన స్పష్టం చేశారు.