విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనలో బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. ఆయనను తొలుత మహారాజ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు.

బారికేడ్లు దాటే సమయంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి కిందపడ్డారు. ఒకేసారి పోలీసులు లాఠీలు ఝళిపించడంతో బూట్లతో తొక్కినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో తీవ్ర ఒత్తిడికి గురై విష్ణువర్ధన్ రెడ్డికి శ్వాస అందడంలో సమస్య ఎదురైందని, దాంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారని అంటున్నారు.

ప్రస్తుతం విష్ణువర్ధన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ప్రస్తుతం ఆయనకు చికిత్స అవసరమని వైద్యులు చెబుతున్నారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విష్ణువర్ధన్ కు ఎమ్మెల్సీ మాధవ్ పరామర్శించారు. ఆయనతోపాటు జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని, దామోదర్, పరశురామ రాజు తదితరులు ఉన్నారు.

ఆ తర్వాత విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శ విష్ణువర్ధన్రెడ్డిని విశాఖపట్నంలోని కేజీహెచ్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.మెరుగైన వైద్య సదుపాయం కోసం విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.

విష్ణువర్ధన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఫోన్ చేశారు.ఈరోజు నెల్లిమర్ల లో జరిగిన సంఘటన పై ఆరా తీశారు. ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. రామతీర్థ సంఘటనపై, అక్కడి పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసుల అత్యుత్సాహంపై డీజీపీతో మాట్లాడుతానని ఆయన చెప్పారు.