Asianet News TeluguAsianet News Telugu

దూకుడు పెంచుదాం, మన టార్గెట్ జగన్-చంద్రబాబు: ఏపీ బీజేపీ కీలక నిర్ణయాలు

వైసీపీతో బీజేపీ సన్నిహితంగా ఉంటుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. ఏపీలో టీడీపీ వైసీపీలకు సమదూరం పాటించాలని నిర్ణయం సమావేశంలో తీర్మానించారు. మూడు నెలల్లోనే వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. 

ap bjp core committee meeting at hyderabad
Author
Amaravathi, First Published Aug 31, 2019, 6:56 PM IST

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఏపీలోనూ దూకుడు పెంచాలని నిర్ణయం తీసుకుంది. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది.  

ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ దిశానిర్దేశం చేశారు. పోలవరం, రాజధాని విషయాల్లో ముందుకే వెళ్లాలని తీర్మానం చేశారు. పోలవరంపై పీపీఏ ఇచ్చిన నివేదికకు కట్టుబడి ఉండాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అమరావతిలో నిర్మాణాలను కొనసాగించేలా జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సమావేశంలో తీర్మానించారు.   

గత ప్రభుత్వం తప్పుచేస్తే శిక్షించాలి కానీ ప్రాజెక్టులు నిలిపివేయడం సరికాదని బిజెపి నేతలు అభిప్రాయపడ్డారు. బీజేపీలో విభిన్న అభిప్రాయాలు ఉండకూడదని ఒకే నిర్ణయంతో అంతా ముందుకు వెళ్లాలని తీర్మానించారు. 

వైసీపీతో బీజేపీ సన్నిహితంగా ఉంటుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. ఏపీలో టీడీపీ వైసీపీలకు సమదూరం పాటించాలని నిర్ణయం సమావేశంలో తీర్మానించారు. మూడు నెలల్లోనే వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. 
 
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎక్కడికక్కడ ఎండగట్టాల్సిందేనని తీర్మానం చేశారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తప్పులనూ వదలొద్దని ప్రజల్లో తీవ్రంగా విమర్శించాలని నిర్ణయించారు.  

తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ దూకుడు పెంచాలని దిశానిర్దేశం చేశారు. బీజేపీ సంస్థాగతంగా ఎదిగేందుకు కీలక నేతలను పార్టీలో చేర్చుకోవాలని తీర్మానించారు. స్థానికసంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని సిద్ధం చేయాలని రామ్ మాధవ్ సూచించారు. రాజధాని అమరావతిలో లేదా విజయవాడలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఏర్పాటుపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ బీజేపీలో రచ్చ: కన్నా కుర్చీకి ఎసరు, వ్యతిరేక వర్గం సమావేశం

Follow Us:
Download App:
  • android
  • ios