Asianet News TeluguAsianet News Telugu

ఆయనో జ్ఞాన భాండాగారం... ఏ అవార్డ్‌కైనా అర్హులే : చాగంటికి గురజాడ పురస్కారంపై సోము వీర్రాజు స్పందన

ఈ ఏడాది గురజాడ పురస్కారాన్ని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు ఇవ్వడంపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. తన దృష్టిలో చాగంటి ఏ అవార్డ్‌కైనా అర్హులేనని తెలిపారు. 
 

ap bjp chief somu veerraju response over Selection of Chaganti Koteswara Rao for Gurajada Apparao award
Author
First Published Nov 27, 2022, 8:52 PM IST

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ప్రకటించడంపై సాహితీ లోకం భగ్గుమంటోంది. ఇప్పటికే కవులు, కళాకారులు, సాహితీ సంఘాలు విజయనగరంలో ర్యాలీ కూడా నిర్వహించాయి. ఈ వివాదం నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. దీనిపై ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. 

"గురజాడ" అవార్డు ఎవరికి ఇవ్వాలి అనే విషయం అవార్డు అందించే వ్యక్తులు , సంస్థల అభిప్రాయంపై ఆధారపడిన అంశం. నా దృష్టిలో బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఏ అవార్డుకు అయినా అర్హులే. చాగంటి గారు అద్భుతమైన జ్ఞాన బాండాగారం. రోడ్లపై ధర్నాలు చేస్తూ చాగంటి గారి పేరు ఉచ్చరించే అర్హత ఎవరికీ లేదు. అవార్డుల పేరుతో ఆయన కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగిస్తే సహించేది లేదు’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా... ప్రతి ఏటా గురజాడ పురస్కారాన్ని అందిస్తుంటారు. ఈ ఏడాది చాగంటి  కోటేశ్వరరావుకు  గురజాడ  పురస్కారం  అందించడంపై   కవులు, కళాకారులు, రచయితలు నిరసనకు దిగారు. గురజాడ  భావ జాలానికి భిన్నమైన  చాగంటి  కోటేశ్వరరావుకు ఈ  అవార్డును  అందించడంపై  వారు  మండిపడుతున్నారు. చాగంటి కోటేశ్వరరావుకు  తాము వ్యతిరేకం కాదని  వారు  చెబుతున్నారు. చాగంటి  కోటేశ్వరరావు  ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతారు. గురజాడ  భావ జాలం దానికి భిన్నంగా  ఉన్న  విషయాన్ని  నిరసనకారులు గుర్తు  చేస్తున్నారు.

భిన్నమైన  భావజాలం  ఉన్న  చాగంటి  కోటేశ్వరరావుకి  ఈ  అవార్డు  ఇవ్వడాన్ని  నిరసనకారులు  తప్పుబడుతున్నారు. గతంలో  కూడా  పలువురు సినీ రంగంలోని  వారికి  గురజాడ పురస్కారాలు  అందించిన  సమయంలో  కూడా  తాము   వ్యతిరేకించిన  విషయాన్ని వారు  గుర్తు  చేస్తున్నారు.ఇదే  డిమాండ్  తో  కవులు, కళాకారులు, రచయితలు  గురజాడ ఇంటి నుండి  ర్యాలీ  నిర్వహించారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios