Asianet News TeluguAsianet News Telugu

ఏపీ బీజేపీలో ‘‘కన్నా’’ కలకలం : ఎవరూ స్పందించొద్దు, కేడర్‌కు వీర్రాజు ఆదేశం.. రాత్రికి బెంగళూరులోనే

ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపై ఆ పార్టీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. తనపై కన్నా చేసిన వ్యాఖ్యలను సోము వీర్రాజు ఢిల్లీలో పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.

ap bjp chief somu veerraju response on kanna lakshminarayana comments
Author
First Published Oct 19, 2022, 5:48 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. విశాఖలో జనసేన కార్యకర్తల, నాయకుల అరెస్ట్‌ల వ్యవహారంపై పవన్‌కు పలువురు విపక్ష నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. జనసేనకు మిత్రపక్షమైన బీజేపీ నేతలు కూడా విశాఖలో పవన్‌ కల్యాణ్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా పవన్ కల్యాణ్‌ను కలిసి విశాఖ ఘటనపై సంఘీభావం ప్రకటించారు. అయితే మంగళవారం జనసేన కార్యకర్త సమావేశంలో.. రాష్ట్ర రాజకీయ ముఖాచిత్రం మారబోతుందని పవన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. 

బీజేపీ రోడ్డు మ్యాప్ ఇవ్వడం లేదంటూ కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ‘‘బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. ఎక్కడో బలంగా పనిచేయలేకపోయాం. అది బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా తెలుసు. మీతో కలిసి పనిచేస్తున్నప్పుడు రోడ్డు మ్యాప్ ఇవ్వకపోతే కాలం గడిచిపోతుంది. పవన్ కల్యాణ్ పదవి కోసమైతే ఇంత ఆరాట పడడు. రౌడీలు రాజ్యాన్ని పాలిస్తుంటే.. నా ప్రజలను రక్షించుకోవడానికి నేను నా వ్యుహాన్ని కూడా మార్చుకున్నాను. అంతా మాత్రాన నేను మోదీకి, బీజేపీకి వ్యతిరేకం కాదు. ఎప్పుడు కలుస్తాం.. ముందుకు తీసుకెళ్తాం.. కానీ ఊడిగం మాత్రం చేయం’’ అని పవన్ పేర్కొన్నారు. 

Also Read:వీర్రాజు వల్లే పవన్ అలా... పార్టీలో ఏం జరుగుతుందో మాకే తెలియదు : కన్నా లక్ష్మీనారాయణ సంచలనం

ఆ తర్వాత కొద్దిసేపటికే విజయవాడలో పవన్‌ కల్యాణ్‌తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. దీంతో టీడీపీతో జనసేన కలిసి నడిసే అవకాశం ఉందనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలోనే బీజేపీ- జనసేన పొత్తు పరిస్థితేమిటనే చర్చ కూడా మొదలైంది. అయితే కార్యకర్తల సమావేశంలో బీజేపీపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత తమకు బీజేపీ మిత్రపక్షంగానే ఉందని చెప్పారు. 

అయితే ఈరోజు పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ సోము వీర్రాజును టార్గెట్ చేశారు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఏపీలో పార్టీ బలోపేతానికి హైకమాండ్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ తో వీర్రాజు సమన్వయం చేసుకోలేకపోయారని... జనసేనతో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సమస్య అంతా సోము వీర్రాజుతోనే అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సోము ఒక్కడే అన్ని చూసుకోవడం వల్లే ఈ పరిస్ధితి దాపరించిందని..  పార్టీలో ఏం జరుగుతుందో తమకు కూడా తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు. 

ఈ వ్యాఖ్యలతో ఏపీ బీజేపీలో కలకలం రేగింది. అయితే ఏ ఒక్కరూ తమ స్పందన తెలియజేయలేదు. సాయంత్రానికి సోము వీర్రాజు స్పందించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కన్నా వ్యాఖ్యలపై ఎవరూ స్పందించవద్దని సోము వీర్రాజు.. పార్టీ అధికార ప్రతినిధులకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. తనపై కన్నా చేసిన వ్యాఖ్యలను సోము వీర్రాజు ఢిల్లీలో పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. మరోవైపు సాయంత్రానికి విజయవాడ రావాల్సిన ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని బెంగళూరులోనే వుండిపోయారు. అటు జరుగుతోన్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోన్న కన్నా లక్ష్మీనారాయణ.. గుంటూరులో తన అనుచరులతో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios