జనసేన-బిజెపి కలిసి బలమైన శక్తిగా మారి ప్రజలకు మేలు చేస్తాయన్నారు... ఇందుకోసం తిరుపతి ఉప ఎన్నికలో బలంగా నిలిచి, చక్కటి సమన్వయంతో విజయం సాధించాలి అని సోము వీర్రాజు పేర్కొన్నారు.
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆదివారం రాత్రి తిరుపతిలో జనసేన-బిజెపి సమన్వయ సమావేశం నిర్వహించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఆ పార్టీ రాష్ట్ర కో ఇంచార్జ్ సునీల్ దేవధర్, తిరుపతి అభ్యర్థి రత్నప్రభతో పాటు బిజెపి ముఖ్య నేతలు సి.ఆదినారాయణ రెడ్డి, మధుకర్, ఎమ్మెల్సీ మాధవ్, జనసేన నుండి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ... జనసేన-బిజెపి కలిసి బలమైన శక్తిగా మారి ప్రజలకు మేలు చేస్తాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ నవరత్నాలు అని ప్రచారం చేసుకుంటున్నారని... అయితే ప్రధాని మోడీ వివిధ పథకాల ద్వారా అంతకంటే ఎక్కువ మేలు చేశారన్నారు. గత ప్రభుత్వం టైంలో కూడా ఉపాధి హామీకి ఎంతో నిధిని సమకూర్చారన్నారు.
''జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అంటే మోడీకి ఎంతో అభిమానం... 2014లోనే నాతో మోడీ చెప్పారు పవన్ కళ్యాణ్ ను మనం గౌరవంగా చూసుకోవాలి అని. ఈ రాష్ట్రానికి అధిపతి అయ్యేది పవనే. ఈ విషయాన్ని అందరూ ట్రూ స్పిరిట్ లో తీసుకోవాలి. తిరుపతి ఉప ఎన్నికలో బిజేపీ, జనసేన బలంగా నిలిచి, చక్కటి సమన్వయంతో విజయం సాధించాలి'' అంటూ పవన్ ప్రశంసలు కురిపించారు.
''గతంలో సారా గ్రామాల్లో కాసే వారు. ఇప్పుడు జగనే కాసేసి బూమ్ బూమ్ అని అమ్మేస్తున్నారు. ఎర్రచందనం దోచేస్తున్నారు. స్మగ్లింగ్ ఆపేందుకు గతంలో కాంతారావు అని ఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో టీమ్ ఉండేది. ఇప్పుడు ఓ వికలాంగుడైన డీఎస్పీతో ఆ టీమ్ నడుపుతున్నారు'' అన్నారు.
