రాష్ట్రంలో హిందువులపై దాడులు జరిగేలా వైసీపీ వ్యవహరిస్తోందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. గుంటూరులోని అగ్రహారం , విశాఖలోని సీతమ్మకొండ పేరు మార్పు, ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని చూడటం వీటన్నింటి వెనుక వున్న సూత్రధారి ఎవరు అని సోము ప్రశ్నించారు. 

వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందన్నారు. గుంటూరులోని అగ్రహారం పేరును రాత్రికి రాత్రి ఫాతిమా అని బోర్డు పెట్టడం ఏంటని వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలోని సీతమ్మకొండ పేరు మార్పు, ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలని చూడటం వీటన్నింటి వెనుక వున్న సూత్రధారి ఎవరు అని సోము ప్రశ్నించారు. ముస్లింల కోసం చట్టాలు మారుస్తామని అంటున్నారని.. హిందువులైన ఎస్సీలకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం తీరు వుందని వీర్రాజు ఫైర్ అయ్యారు. హిందువులపై దాడులు జరిగేలా వైసీపీ వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇకపోతే రెండ్రోజుల క్రితం సోము వీర్రాజు మాట్లాడుతూ.. విశాఖపట్నంలోని సీతకొండ టూరిజం స్పాట్‌కు వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా నామకరణం చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. సొంత ఆస్తులకు, భవనాలకు పెట్టుకోవాల్సిన పేర్లను ప్రభుత్వ ఆస్తులకు పెట్టడమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులకు ఎంతోకాలంగా ఉన్న పేర్లను తీసేసి ఆయన తండ్రి పేరు పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించడాన్ని ఖండిస్తున్నట్టుగా చెప్పారు. సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపహంరించుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ తండ్రి పేరును వారి ఆస్తులకు, లోటస్ పాండ్‌కు పెట్టుకోవాలని అన్నారు. 

Also Read: లోటస్‌పాండ్‌కు మీ పేర్లు పెట్టుకోండి..: జగన్ సర్కార్‌పై సోము వీర్రాజు ఫైర్

విశాఖపట్నంలో తమ పార్టీ శ్రేణుల అక్రమ గృహ నిర్బంధాన్ని అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ మేరకు సోము వీర్రాజు ట్విట్టర్‌లో వీడియో పోస్టు చేశారు.