2024లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బదులిచ్చారు. కుటుంబ పార్టీల కోసం బీజేపీ త్యాగం చేయదని.. ఆ త్యాగాన్ని చాలా సార్లు గమనించామంటూ చంద్రబాబుకు చురకలు వేశారు.  

టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) చేసిన పొత్తుల వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ (bjp) చీఫ్ సోము వీర్రాజు (somu verraju) కౌంటరిచ్చారు. కొంతమంది త్యాగానికి సిద్ధంగా వున్నామని మాట్లాడుతున్నారని.. ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో ఆ త్యాగం గమనించామని చురకలు వేశారు. కుటుంబ పార్టీల కోసం బీజేపీ త్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు సోము వీర్రాజు. అభివృద్ది, సంక్షేమం బీజేపీ దగ్గర ఉందని.. త్యాగ ధనులంతా తెలుసుకోవాలని ఆయన దుయ్యబట్టారు. 2024లో మోడీ నాయకత్వంలో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.

విజయవాడలో ఆదివారం జరిగిన బీజేపీ కిసాన్ మోర్చా (bjp kisan morcha) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో రైతులను సంస్కరించడంలో అధికారాన్ని అనుభవించిన కుటుంబ పార్టీలు ఘోరంగా వైఫల్యం చెందాయని సోము వీర్రాజు ఆరోపించారు . రైతు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతును పూర్తిగా మోసగించారని...గతంలో చంద్రబాబు, నేడు జగన్ (ys jagan) ప్రభుత్వాలు ఈ అంశంలో దగ చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. 

మిల్లర్ల చేతిలో కీలు బొమ్మలుగా చంద్రబాబు, జగన్ మారారని.. రాష్ట్ర పౌర సరఫరాలశాఖ అధికారులైతే మోచేతి కింద నీళ్లు తాగే విధానంలో వ్యవహరిస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. ప్రభుత్వం, రైస్ మిల్లర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులు కలిసి రాష్ట్ర రైతాంగాన్ని పూర్తిగా నట్టేట ముంచారు ఆగ్రహం వ్యక్తం చేశారు . జగన్ ప్రభుత్వం పూర్తిగా రైస్ మిల్లర్లకు అండగా నిలుస్తూ అక్రమాలకు అండగా ఉంటోందని దుయ్యబట్టారు . రైస్ మిల్లర్ల అసోసియేషన్ ఛైర్మనునే.. సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మనుగా నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యే తండ్రిని ఛైర్మన్ చేయడం ద్వారా.. రైతులను మోసగించే వైఖరి అవలంబిస్తున్నారని ఫైరయ్యారు. కేంద్రం ఇచ్చే అనేక సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని సోము వీర్రాజు ఆరోపించారు. 

దేశానికి వెన్నెముక అయిన రైతును ఆదుకోవాలని మోడీ అనేక పధకాలు అమలు చేస్తున్నారన్నారని ఆయన ప్రశంసించారు. మాట మాటకి సంక్షేమ కార్యక్రమం అనే జగనుకు.. కేంద్రం అమలు చేసే పధకాలు సంక్షేమాన్ని గుర్తు చేయడం లేదేం అని సోము వీర్రాజు నిలదీశారు. ప్రధాని అమలు చేసే సంక్షేమం ముందు.. జగన్ సంక్షేమం తీసికట్టన్నారు. అన్ని వర్గాల వారికి మోడీ ప్రాధాన్యత ఇచ్చి పధకాలను అమలు చేస్తున్నారని.. బీజేపీ కార్యకర్తలు వికాసం, విజ్ఞానంతో ఆలోచించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రం అమలు చేస్తున్న అనేక పథకాలను ప్రజలకు వివరిస్తూ, జగన్ మోసాలను బయట పెట్టాలని సోము వీర్రాజు ఆదేశించారు. ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడే దమ్ము, ధైర్యం ఒక్క బీజేపీకే ఉందన్నారు .

ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులపై TDP చీఫ్ Chandrababu Naidu శుక్రవారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాఉద్యమం రావాలి, టీడీపీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే ఓ మెట్టు దిగుతానన్నారు. ఎంతటి త్యాగానికైనా సిద్దమేనని ఆయన తేల్చి చెప్పారు.