బీజేపీ తమకు అండగా పోవచ్చునంటూ ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. ఏపీలో రాజకీయ పార్టీలన్నీ జగన్‌కు సపోర్ట్ చేయాలా అని ఆయన ప్రశ్నించారు.

బీజేపీ తమకు అండగా పోవచ్చునంటూ ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో బీజేపీని పలుచన చేయాలనేది జగన్ వ్యూహమని ఆరోపించారు. అసలు బీజేపీ ఎప్పుడు వైసీపీతో కలిసి వుందో జగన్ చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏపీలో రాజకీయ పార్టీలన్నీ జగన్‌కు సపోర్ట్ చేయాలా అని ఆయన ప్రశ్నించారు. తాము విమర్శలు చేస్తే జగన్‌ ఏం మాట్లాడరని అన్నారు.

కేంద్ర పథకాలకు జగన్ వైసీపీ ముద్ర వేస్తున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిధులు విడుదల చేసిందన్నారు. వైసీపీకి సహకరిస్తామని బీజేపీ కానీ జనసేన కానీ ఎప్పుడు చెప్పలేదని సోము వీర్రాజు వెల్లడించారు. ఈ నెల 20 నుంచి ఇంటింటికి తిరుగుతామని.. మోడీ 9 ఏళ్ల పాలనపై ప్రజలకు వివరిస్తామని ఆయన పేర్కొన్నారు. 

Also Read: మోదీ, అమిత్ షా మధ్య విబేధాలు... అందుకే జగన్ టార్గెట్ : ఏపీ ఉపముఖ్యమంత్రి సంచలనం

అంతకుముందు మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా , బీజేపీ నేతల విమర్శలకు కౌంటరిచ్చారు. విశాఖపట్టణంలో భూదందా జరిగితే ఇంతవరకు బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదన్నారు. అమిత్ షా చెప్పేవరకు రాష్ట్రంలో అవినీతి జరిగిందని జీవీఎల్ కు తెలియదా? అని మంత్రి ప్రశ్నించారు. ఇంతకాలం పాటు ఎందుకు ప్రశ్నించలేదో జీవీఎల్ ఆత్మవిమర్శ చేసుకోవాలని బొత్స సత్యనారాయణ చురకలంటించారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను అమిత్ షా, జీవీఎల్ చదివారని అర్ధమౌతుందని మంత్రి విమర్శించారు. 

ప్రధానితో మా బంధం ఎలా ఉందో అమిత్ షాతో అలానే ఉందని ఆయన చెప్పారు. ఒకరితో ఎక్కువ, మరొకరితో తక్కువగా లేవని మంత్రి వివరించారు. ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవిగా మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా రెండు వందే భారత్ రైళ్లు తప్ప బీజేపీ ఏమిచ్చిందని సత్యనారాయణ ప్రశ్నించారు. 9 ఏళ్ల తర్వాత రెవెన్యూ లోటు నిధులిచ్చామంటే ఎలా అని మంత్రి నిలదీశారు. వడ్డీతో సహా చూస్తే ఇంకా ఎక్కువే రావాలన్నారు. బీజేపీ నుండి తమకు ప్రత్యేకంగా వెన్నుదన్ను లేదన్నారు. తమకు ఏ పార్టీతో పొత్తు లేదని.. రాజ్యాంగబద్దంగా ఎవరిపై ఆంక్షలు లేవని పవన్ కళ్యాణ్ వారాహి యాత్రనుద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు.