ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల పట్ల అవలంభిస్తోన్న విధానాలపై మండిపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. అధికారులు, మిల్లర్లు దందాలో ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని సోము వీర్రాజు దుయ్యబట్టారు.  

ఆంధ్రప్రదేశ్ రైతాంగం (andhra pradesh farmers) ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై బీజేపీ (bjp) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) గ‌ళం వినిపించారు. ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం (ysrcp ) రైతుల‌కు న‌మ్మ‌క ద్రోహం చేస్తోంద‌ని ఆరోపించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఏపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు.

‘‘ రైతులకు మద్దతు ధర కల్పించాలి. రాయలసీమ రైతాంగానికి తుంపర సేద్యం చేసేందుకు వీలుగా యంత్రాలను సమకూర్చాలి.ధాన్యం బకాయిలు సాధ్యమైనంత త్వరగా రైతులకు అందే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ పెద్దలు మిల్లర్లకు తలొగ్గి రైతాంగం తలదించుకునేలా చేస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. అధికారులు, మిల్లర్లు దందాలో ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడం రైతులకు నమ్మకద్రోహం చేసినట్టు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలి అంటూ సోము వీర్రాజు ట్వీట్ చేశారు. 

అంతకుముందు రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ నిన్న నెల్లూరు నగరంలో బీజేపీ నేత‌లు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. అయితే బీజేపీ నేతలను కలెక్టరేట్‌లోని రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ నేతలు ముఖ్యమంత్రికి, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు పండించే ధాన్యం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. 

ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నుంచి రైతుల తరఫున ఉద్యమ సమరశంఖం పూరించామని చెప్పారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నా కనికరం లేదని మండిపడ్డారు. రైతుల కష్టాన్ని అధికారులు, మధ్య దళారులు దోచుకుంటున్నారని విమర్శించారు. ఎఫ్‌సీఐ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా జగన్ ప్రభుత్వం మిల్లర్లకు దాసోహమైందని ఆరోపించారు. 

మరోవైపు నెల్లూరు ధర్మోపవర్ ఉత్పత్తి కేంద్రం వ‌ద్ద కార్మికుల ఆందోళనలకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మద్దతు తెలిపారు. బీజేపీ నేతలతో కలిసి ధర్నాకు దిగారు. ధ‌ర్మోప‌వ‌ర్ ఉత్ప‌త్తి కేంద్రాన్ని ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారో స్పష్టం చేయాల్సిన బాధ్య‌త‌ ఏపీ ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఒక‌వేళ దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్ర‌య‌త్నాలు ఇలాగే కొనసాగిస్తే కార్మికుల త‌ర‌ఫున బీజేపీ పోరాడుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. నెల్లూరు జిల్లా ప్రజలు ప్రభుత్వానికి మనుషులు లాగ కనపించడం లేదా అని ప్రశ్నించారు. ప‌రిశ్ర‌మ న‌ష్టాల‌కు బాధ్యులు ఎవరని ఆయ‌న ప్రభుత్వాన్ని నిల‌దీశారు. 

Scroll to load tweet…