Asianet News TeluguAsianet News Telugu

శవాల మీద పైసలు ఏరుకునేవాళ్లు:టీడీపీపై కన్నా తిట్ల దండకం

తెలుగుదేశం పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి నిప్పులు చెరిగారు. టీడీపీలో కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌ నిందితులు ఉన్నారని ఆరోపించారు. దుర్గగుడిలో కొబ్బరి చిప్పలు, చెప్పులు దొంగిలించే దొంగలే టీడీపీలో ఉన్నారంటూ ధ్వజమెత్తారు. 

Ap bjp chief kanna laxmi narayana slams tdp leaders
Author
Guntur, First Published Oct 17, 2018, 3:47 PM IST

గుంటూరు: తెలుగుదేశం పార్టీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి నిప్పులు చెరిగారు. టీడీపీలో కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌ నిందితులు ఉన్నారని ఆరోపించారు. దుర్గగుడిలో కొబ్బరి చిప్పలు, చెప్పులు దొంగిలించే దొంగలే టీడీపీలో ఉన్నారంటూ ధ్వజమెత్తారు. 

టీడీపీ నేతలు వాడుతున్న బాష అభ్యంతరకరంగా ఉందని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలపై గతంలో ధర్నా కూడా చేశామని చెప్పుకొచ్చారు. చంద్రబాబును, కేసీఆర్‌ తిడితే అంతా దానిగురించే మాట్లాడతారని కానీ మోదీని తిట్టినప్పుడు మీరంతా ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

ఒళ్లు దగ్గర పెట్టుకుని టీడీపీ నేతలు మాట్లాడాలని కన్నా వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌, జీవీఎల్‌ నరసింహారావును ఒక టీవీ ఛానెల్ డిబేట్ లో పచ్చిబూతులు తిట్టారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకుతింటూ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. 

శవాల మీద పైసలు ఏరుకునే విధంగా టీడీపీ నేతల ప్రవర్తన ఉందని దుయ్యబుట్టారు. కేంద్రాన్ని తిట్టి సీఎం బాధ్యతల నుంచి తప్పుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి చంద్రబాబు తిత్లీ విపత్తును కూడా రాజకీయాలకు వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

ప్రధాని నరేంద్రమోదీని, బీజేపీని విమర్శించడం కాదని చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కన్నా లక్ష్మీనారాయణ. రాష్ట్రంలో జరిగిన అవినీతి టీడీపీ నేతల భాగోతాలపై ఐదు ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలిపారు. 

చంద్రబాబుకు ఐదు ప్రశ్నలు సంధించారు కన్నా. పల్నాడులో అక్రమ మైనింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించుకోగలరా ? అని ప్రశ్నించారు. ఎస్టిమేషన్లు పెంచి సీఎం రమేశ్‌కు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బా రెడ్డిలను కూర్చోబెట్టి వాటాలు పంచుకోమని చెప్పలేదా అది వాస్తవం కాదా అని నిలదీశారు. 

రూ.480 కోట్ల రూపాయలతో నిరుద్యోగులకు ఇచ్చే శిక్షణకు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఐటీ దాడులు చేస్తే రాష్ట్రంలో భావోద్వేగాలను ఎందుకు రెచ్చగొడుతున్నారో సమాధానం చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios