గుంటూరు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగు ముందుకు వేయడంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం చోటు చేసుకుంది. పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 40 క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య వివాదానికి కారణమైంది. అయితే రాయలసీమకు నీరందించడానికి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తీసుకోకూడదని ఏపి బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. 

శ్రీశైలంలోని మిగులు జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకునే అవకాశం ఉందని తాము ఎప్పటినుండో చెబుతున్నామని అన్నారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని కన్నా స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలను నివృత్తి చేసి ఒప్పించో, న్యాయ పోరాటం చేసో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కన్నా సూచించారు. 

ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమకు మాత్రం వెనక్కి తగ్గకుండా నీళ్ళు ఇవ్వాల్సిందే అని కన్నా డిమాండ్ చేశారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని గతంలో బీజేపీ పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. అందుకోసం ఉపయోగపడే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయాలని... అందుకు తమ సహకారం వుంటుందని కన్నా అన్నారు. 

శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మోతాదుకు మించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించుకుని వెళ్లడానికి దాని సామర్థ్యం పెంచుతుందనేది తెలంగాణ ప్రభుత్వం వాదన. నిజానికి, రాయలసీమకు కృష్ణా మిగులు జలాలను వాడుకునే హక్కు మాత్రమే ఉంటుంది. నికర జలాల కేటాయింపు లేదు. దీంతో వరదలు అధికంగా వచ్చే కాలంలో శ్రీశైలం నుంచి వరద నీటిని తరలించుకుని వెళ్లడానికి ఆ ప్రాజెక్టును చేపట్టారు. 

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు సరఫరా చేసే నీటిని నియంత్రించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద దాన్ని నిర్మించడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. నీటి సరఫరాను నియంత్రించేందుకు నాలుగు తూముల ఏర్పాటు ఉంది.

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడం వల్ల తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అంటున్నారు. అయితే, శ్రీశైలం రిజర్వాయరులో నీటి మట్టం 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించుకుని వెళ్లడానికి వీలవుతుందని, తెలంగాణకు 880 అడుగుల వద్ద నీటి సామర్థ్యం ఉన్నప్పుడు 2 టీఎంసీల నీరు తరలించడానికి వీలవుతుందని, అందువల్ల తెలంగాణకు ఏ విధమైన అన్యాయం జరగదని వైఎస్ జగన్ అంటున్నారు. 

వరదలు ఎక్కువగా వచ్చే పది రోజులు మాత్రమే శ్రీశైలం రిజర్యాయరులో నీటి మట్టం ఆ స్థాయిలో ఉంటుందని, ఆ పది రోజుల్లో మాత్రమే నీటిని తాము తీసుకుంటామని జగన్ వాదిస్తున్నారు. అయితే, కేసీఆర్ ఆ వాదనతో ఏకీభవించే స్థితి లేదు.