గత ఐదేళ్ల కాలంలో దేశంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమే బీజేపీ అఖండ విజయమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. రాష్ట్రంలో తమ పార్టీపై విష ప్రచారం చేశారని కన్నా ఆరోపించారు.

జగన్ ట్రాప్‌లో పడుతున్నావని.. నాడు బాబును హెచ్చరించినా ఆయన పట్టించుకోలేదన్నారు. ఏపీకి అన్నీ ఇచ్చామని చెప్పినా.. మా మాట పట్టించుకోకుండా తమపై నిందలు మోపారని కన్నా విమర్శించారు.

ప్రత్యేక హోదా అనేది ఇప్పటికీ ముగిసిపోయిన అధ్యాయమని, ఏపీ అభివృద్ధి.. దేశాభివృద్ధి అనే నినాదానికి ప్రధాని కట్టుబడి ఉన్నారని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

తాము చేసిన అభివృద్దికి ఆంధ్రప్రదేశ్‌లో తగినంత ప్రచారం లభించకపోవడం వల్లే ఏపీలో వెనుకబడ్డామని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేకహోదా గురించి ఇకపై ఎవరు మాట్లాడినా అది ప్రజలను మళ్లీ మభ్యపెట్టడమే అవుతుందన్నారు.