అందువల్లే రాష్ట్రంలో ఇన్నేళ్లుగా బలపడలేకపోతున్నాం.. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు పార్టీ అగ్రనేతలు కృతనిశ్చయంతో పని చేయాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు పార్టీ అగ్రనేతలు కృతనిశ్చయంతో పని చేయాలని కోరారు. పురందేశ్వరి మంగళవారం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జ్‌లు, వివిధ మోర్చాల అధ్యక్సులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అధికారంలోకి వస్తామనే భావనతో పనిచేయాలని, పోలింగ్ బూత్ వరకూ పార్టీ కమిటీలు ఏర్పాటుచేయాల్సిందేనని చెప్పారు.
పార్టీలో గ్రూప్‌లకు తావు ఉండకూడదని.. వాటితోనే రాష్ట్రంలో ఇన్నేళ్లుగా బలపడలేకపోతున్నామని అభిప్రాయపడ్డారు. ఇకపై అంతా పార్టీ కోసమే పనిచేయాలని స్పష్టం చేశారు. నాయకులు పార్టీని పునాది నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించేలా చేయడం, ఐటీ వింగ్‌ను బలోపేతం చేయడం ప్రాముఖ్యతను కూడా పురందేశ్వరి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
సోషల్ మీడియా ద్వారా మోదీ ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పురందేశ్వరి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. సెప్టెంబరు 17(మోదీ జన్మదినం) నుంచి అక్టోబరు 2(గాంధీ జయంతి) చేపట్టాల్సిన కార్యక్రమాలను త్వరలోనే వెల్లడించనున్నట్టుగా పురందేశ్వరి తెలిపారు.