Asianet News TeluguAsianet News Telugu

పవన్-చంద్రబాబు భేటీ నేపథ్యంలో బీజేపీ అలర్ట్.. ఢిల్లీకి సోము వీర్రాజు.. వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలోనే పవన్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడంతో.. ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

ap bjp alert on chandrababu naidu and Pawan Kalyan Meeting
Author
First Published Oct 19, 2022, 12:17 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాలతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. విశాఖలో జనసేన కార్యకర్తల, నాయకుల అరెస్ట్‌ల వ్యవహారంపై పవన్‌కు పలువురు విపక్ష నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. జనసేనకు మిత్రపక్షమైన బీజేపీ నేతలు కూడా విశాఖలో పవన్‌ కల్యాణ్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా పవన్ కల్యాణ్‌ను కలిసి విశాఖ ఘటనపై సంఘీభావం ప్రకటించారు. అయితే మంగళవారం జనసేన కార్యకర్త సమావేశంలో.. రాష్ట్ర రాజకీయ ముఖాచిత్రం మారబోతుందని పవన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. 

బీజేపీ రోడ్డు మ్యాప్ ఇవ్వడం లేదంటూ కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ‘‘బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. ఎక్కడో బలంగా పనిచేయలేకపోయాం. అది బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులకు కూడా తెలుసు. మీతో కలిసి పనిచేస్తున్నప్పుడు రోడ్డు మ్యాప్ ఇవ్వకపోతే కాలం గడిచిపోతుంది. పవన్ కల్యాణ్ పదవి కోసమైతే ఇంత ఆరాట పడడు. రౌడీలు రాజ్యాన్ని పాలిస్తుంటే.. నా ప్రజలను రక్షించుకోవడానికి నేను నా వ్యుహాన్ని కూడా మార్చుకున్నాను. అంతా మాత్రాన నేను మోదీకి, బీజేపీకి వ్యతిరేకం కాదు. ఎప్పుడు కలుస్తాం.. ముందుకు తీసుకెళ్తాం.. కానీ ఊడిగం మాత్రం చేయం’’ అని పవన్ పేర్కొన్నారు. 

ఆ తర్వాత కొద్దిసేపటికే విజయవాడలో పవన్‌ కల్యాణ్‌తో చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. దీంతో టీడీపీతో జనసేన కలిసి నడిసే అవకాశం ఉందనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలోనే బీజేపీ- జనసేన పొత్తు పరిస్థితేమిటనే చర్చ కూడా మొదలైంది. అయితే కార్యకర్తల సమావేశంలో బీజేపీపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత తమకు బీజేపీ మిత్రపక్షంగానే ఉందని చెప్పారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ బీజేపీ నాయకులు అప్రమత్తం అయ్యారు. తాజా పరిణామాలను అధిష్టానానికి వివరించేందుకు సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లారు. బెంగళూరు నుంచి సోము వీర్రాజు ఢిల్లీ చేరుకున్నారు. ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితులు, పవన్ వ్యాఖ్యలను బీజేపీ పెద్దల దృష్టికి సోము వీర్రాజు తీసుకెళ్లారు. ఇటీవల పవన్ కల్యాణ్‌కు సంఘీభావం ప్రకటించేందుకు వెళ్లిన సమయంలో కూడా.. జనసేన-బీజేపీ సంబంధాలపై కూడా కీలకమైన చర్చ సాగినట్టుగా తెలుస్తోంది. ఈ అంశాలను కూడా సోము వీర్రాజు.. బీజేపీ అధిష్టానానికి నివేదించినట్టుగా సమాచారం. 

ఇక, ఈ రోజు సాయంత్రం  సోము వీర్రాజు విజయవాడ చేరుకోనున్నారు. విజయవాడ చేరుకున్న తర్వాత.. అందుబాటులో ఉన్న రాష్ట్ర బీజేపీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చిచడంతో.. అధిష్టానం సూచనలను పార్టీ నాయకులకు తెలియజేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios