Asianet News TeluguAsianet News Telugu

ఏపీ బంద్ లో అధికార వైసిపి... రోడ్డుపై బైఠాయించిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు

రాష్ట్రవ్యాప్త బంధ్ లో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, వ్యవసాయ మరియు మర్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 

AP Bandh... Miniters, YSRCP MP, MLAs Protest in Vizag
Author
Visakhapatnam, First Published Mar 5, 2021, 1:05 PM IST

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి పిలుపుమేరకు జరుగుతున్న రాష్ట్రవ్యాప్త బంధ్ లో కార్మిక సంఘాలు,  అఖిలపక్ష నాయకులతో పాటు సామాన్య ప్రజలు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం నుంచి వైజాగ్ లోని మద్దిలపాలెం కూడలి వద్ద వైసిపి శ్రేణులు మానవహారంగా ఏర్పడి బంద్ లో పాల్గొంటున్నారు.  రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, వ్యవసాయ మరియు మర్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 

ఉక్కు బంద్‌కు ప్రభుత్వ మద్దతు : రాష్ట్రవ్యాప్త బంద్‌ పిలుపునకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం వరకూ డిపోలకే పరిమితం చేస్తామని రవాణా మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఆ తర్వాత సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి విధుల్లో పాల్గొంటారని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం వరకూ డిపోల నుంచి బస్సులు బయటకు తీయబోమని కార్మిక సంఘాలు ఈయూ, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌, వైఎ్‌సఆర్‌ మజ్దూర్‌ యూనియన్లు ప్రకటించాయి. రాష్ట్రంలో బంద్‌ జరుగుతున్న సమయంలోనే 8 రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ స్టీల్‌ప్లాంట్ల  ఎదుట ఆందోళనలు నిర్వహించాలంటూ స్టీల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, సీఐటీయూ పిలుపునిచ్చాయి.  

ఉక్కు పరిరక్షణ సమితి ఇచ్చిన బంద్‌ పిలుపునకు బీజేపీ మినహా ఇతర అన్ని పార్టీలు మద్దతు పలికాయి. వామపక్షాలు, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రత్యక్షంగా ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి. బీజేపీ మిత్రపక్షమైన జనసేన మాత్రం దీనిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఆ పార్టీకి చెందిన విశాఖ నేతలు మాత్రమే బంద్‌కు మద్దతు పలికారు.  ఇక అధికార వైసీపీ కూడా బంద్‌కు సంఘీభావం ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వం కూడా ‘ఉక్కు బంద్‌’కు సహకరిస్తున్నట్లు వెల్లడించింది.

లారీ యజమానుల సంఘం కూడా బంద్‌కు మద్దతు పలికింది. గనుల కేటాయింపు,  ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విశాఖ ఉక్కు (ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను కేంద్ర ప్రభుత్వం నిలబెట్టాలని, ప్రైవేటు పరం చేయరాదని తమ ప్రకటనల్లో డిమాండ్‌ చేశారు. ‘‘కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు, అన్ని వర్గాల వారు పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలి’’ అని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిదులు పిలుపునిచ్చారు. 

బీజేపీ సైలెన్స్‌ : దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు పెట్టుబడులకు తలుపులు తెరిసిన మోదీ ప్రభుత్వ నిర్ణయంతో విశాఖ ఉక్కు పరిశ్రమ (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌-ఆర్‌ఐఎన్‌ఎల్‌) ప్రమాదంలో పడిన సంగతి తెలిసిందే. ఈ విషయం బయట పడగానే విశాఖ ఉక్కు కార్మికులు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నారు. వారికి  బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతిస్తున్నాయి. 

ముఖ్యమంత్రి జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు విశాఖ వెళ్లి ఉద్యమకారులతో మాట్లాడి వచ్చారు. ఉద్యమంలో భాగంగా మార్చి 5న రాష్ట్ర బంద్‌కు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. చిన్న ట్వీట్‌ కే అంత రాద్ధాంతమా.? అంటూ ఉద్యమకారులపై మండిపడ్డ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కేంద్రం ఇచ్చిన స్పష్టతతో పూర్తిగా మౌనం దాల్చుతున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు సైతం నోరు విప్పడం లేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios