అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 14 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.  ఈ నెల 12వ తేదీ నుండి  అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

బుధవారం  నాడు ఏపీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అమరావతిలో బీఏసీ సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో  ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ నుండి ఆ పార్టీ డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడు, జనసేన నుండి రాపాక వరప్రసాద్‌ హాజరయ్యారు. సంఖ్యాబలం ఆధారంగా టీడీపీకి ఒక్కరికే ఈ సమావేశంలో పాల్గొనే వకాశాన్ని కల్పించారు.  

కరవు, వర్షాభావ పరిస్థితులు, తమ పార్టీ కార్యకర్తలపై దాడుల గురించి చర్చించాలని బీఏసీ సమావేశంలో టీడీపీ పట్టుబట్టినట్టు సమాచారం. కరవు, వర్షాభావ పరిస్థితులపై చర్చించేందుకు ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందించిందని చెబుతున్నారు. 

14  రోజుల పాటు అసెంబ్లీ పని చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. శని, ఆదివారాల్లో అసెంబ్లీకి సెలవు ఇచ్చారు. ఈ నెల 30వ తేదీ వరకే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు.

ప్రతి రోజూ కీలక అంశాలపై ప్రభుత్వం శ్వేత పత్రాలను విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే విధంగా కీలక బిల్లులను కూడ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 12వ తేదీన శాసనమండలిలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్  బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.  వ్యవసాయ బడ్జెట్‌ను కూడ మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు.