వేలాది కోట్ల రూపాయల మోసంలో నష్టపోయిన బాధితులకు న్యాయం చేసేందుకు అన్నీ అవకాశాలను పరిశీలించాలంటూ సభ నిర్ణయించింది.
ఆగ్రిగోల్డ్ బాధితులకు అసెంబ్లీ బాసటగా నిలబడింది. వేలాది కోట్ల రూపాయల మోసంలో నష్టపోయిన బాధితులకు న్యాయం చేసేందుకు అన్నీ అవకాశాలను పరిశీలించాలంటూ సభ నిర్ణయించింది. సభను ఊపేసిన అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో పాలక, ప్రతిపక్షాలు తీవ్రంగానే స్పందించాయి. సభలో ఇదే విషయమై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, బాధితులకు న్యాయం జరిగేందుకు ఏ ఏజెన్సీతో విచారణ జరిపించేందుకైనా సిద్ధమేనన్నారు. ప్రస్తుతం సిఐడి విచారణ జరుపుతోందని, సిబిఐతో విచారణ జరిపిస్తే న్యాయం జరుగుతుందని అందరూ భావిస్తే సిబిఐతో విచారణ చేయించేందుకు కూడా ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరమూ లేదన్నారు.
దేశవ్యాప్తంగా 32 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నట్లు సిఎం వివరించారు. రూ. 6384 కోట్ల మేరకు ఖాతాదారులు సంస్ధ వల్ల నష్టపోయారన్నారు. గతంలో కూడా ఆర్ధిక సంస్ధల వల్ల నష్టపోయిన బాధితులను తమ ప్రభుత్వం ఆదుకుందని చంద్రబాబు చెప్పారు.
ఇదే విషయమై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, సంస్ధ వల్ల రాష్ట్రంలో నష్టపోయిన 19.5 లక్షల బాధితులకు వెంటనే న్యాయం జరగాలన్నారు. రూ. 1182 కోట్ల తో 13.83 లక్షల మంది ఖాతాదారులకు వెంటనే న్యాయం జరుగుతుందని కాబట్టి ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. సంస్ధకున్న ఆస్తుల మార్కెట్ విలువ ప్రకారం రూ. 7300 కోట్లని జగన్ తెలిపారు. కాబట్టి సంస్ధ ఆస్తులను వెంటనే అమ్మి లక్షలాది మంది ఖాతాదారులకు న్యాయం చేయమని చెప్పారు. అంతేకాకుండా బాధితుల వివరాలను ఆన్ లైన్లో పెట్టాలని కూడా డిమాండ్ చేసారు. అదేవిధంగా బాధ్యులందరినీ కూడా వెంటనే అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేసారు.
