Ap assembly: టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్, అచ్చెన్నతో పాటు...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజధాని రగడ చోటు చేసుకుంది. అమరావతిపై చర్చకు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నిసార్లు రిక్వస్ట్ చేసిన సభ్యులు వినకపోవడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజధాని రగడ చోటు చేసుకుంది. అమరావతిపై చర్చకు తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నిసార్లు రిక్వస్ట్ చేసిన సభ్యులు వినకపోవడంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన 9మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలంటూ సీఎం జగన్ సూచించారు. దాంతో శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో సభ్యులు ఆమోదం తెలపడంతో స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.
సీఎం జగన్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలతో స్పీకర్ తమ్మినేని సీతారాం మూజువాణి ఓటు ద్వారా సభ్యుల ఆమోదం కోరారు. అందుకు సభ్యులు అంగీకారం తెలపడంతో తొమ్మిదిమందిపై సస్పెన్షన్ వేటు వేశారు.
టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్, గద్దె రామ్మోహన్, బాల వీరాజంనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, మద్దాల గిరిధర్ రావు, ఏలూరు సాంబశివరావు, వెలగపూడి రామకృష్ణబాబులపై సస్పెన్షన్ వేటు వేశారు.
సస్పెన్షన్ వేటుకు గురైన సభ్యులు సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. అయితే సస్పెన్షన్ కు గురైన సభ్యులు సభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ తమ్మినేని సీరియస్ అవ్వడంతో వారంతా సభనుంచి వెళ్లిపోవడంతో సభ కాస్త సద్దుమణిగింది.