ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. పెగాసస్ అంశంపై సభలో చర్చించడం సరికాదంటూ టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. పెగాసస్ అంశంపై సభలో చర్చించడం సరికాదంటూ టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరాధార ఆరోపణలు చేసి సభలో చర్చ పెట్టాలని కోరడాన్ని లేఖలో తప్పుబట్టారు. పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారని వారు లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు రాతపూర్వక సమాధానం కూడా ఇచ్చారని చెప్పారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై చర్చ అవసరం లేదని రాజ్యసభలో అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ప్రభుత్వం నిరాధరమైన ఆరోపణలపై సభలో చర్చించాలని కోరడం విడ్డూరంగా ఉందని టీడీసీ సభ్యులు అన్నారు. ఇటువంటి చర్యలను నిరోధించి సభ గౌరవం కాపాడాలని టీడీపీ సభ్యులు లేఖలో స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు విజ్ఞప్తి చేశారు.

ఇక, సోమవారం ఉదయం శాససనసభ ప్రారంభమైన తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.. పెగాసస్ అంశాన్ని ప్రస్తావించారు. పెగాసస్‌ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. పెగాసస్‌పై కమిటీ వేసి సుప్రీం దర్యాప్తు చేపట్టిందన్నారు. చంద్రబాబు హయాంలోనే పెగాసస్‌ను వాడారని బెంగాల్‌ సీఎం చెప్పారని అన్నారు. పెగాసస్‌ సాప్ట్‌వేర్‌ ద్వారా ఫోన్లు ట్యాపింగ్‌ చేసే అవకాశముందన్నారు. పెగాసస్‌పై చర్చించి కమిటీకి రిపోర్ట్‌ చేయాల్సి బాధ్యత ఉందని మంత్రి అన్నారు. మరోవైపు పెగాసస్‌పై చర్చకు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నోటీసు ఇచ్చారు. దీంతో స్వల్పకాలిక చర్చ చేపడతామని స్పీకర్ తమ్మినేని తెలిపారు. 

టీడీపీ సభ్యులను ఒక్క రోజు సస్పెండ్ చేసిన స్పీకర్..
ఇక, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభలో గందరగోళం చోటుచేసుకుంది. నాటు సారా, కల్తీ మధ్యం నిషేధించాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఫ్లకార్డులు చేతపట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జంగారెడ్డి గూడెం మరణాలపై జ్యూడీషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు వారి నిరసనను తెలియజేశారు. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది బజార్ కాదని.. శాసనసభ అని స్పీకర్ తమ్మినేని టీడీపీ సభ్యులతో అన్నారు. సభలో హుందాగా వ్యవహరించాలని సూచించారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ సభ్యులను ఒక్క రోజు పూర్తిగా సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. వారిని బయటకు తీసుకెళ్లాల్సిందిగా మార్షల్స్‌ను ఆదేశించారు.