ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం ఉదయం గందరగోళం చోటుచేసుకుంది. సభలో నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం అయ్యాయి. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో సభలో గందరగోళం చోటుచేసుకుంది. నాటు సారా, కల్తీ మధ్యం నిషేధించాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఫ్లకార్డులు చేతపట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జంగారెడ్డి గూడెం మరణాలపై జ్యూడీషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు వారి నిరసనను తెలియజేశారు. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది బజార్ కాదని.. శాసనసభ అని స్పీకర్ తమ్మినేని టీడీపీ సభ్యులతో అన్నారు. సభలో హుందాగా వ్యవహరించాలని సూచించారు. ‘ఇది శాసససభ.. వీధి మార్కెట్ కాదు... మీరు వీధి రౌడీలు కాదు’ అంటూ టీడీపీ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ వ్యాఖ్యానించారు. స్పీకర్ పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ సభ్యులను ఒక్క రోజు పూర్తిగా సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. వారిని బయటకు తీసుకెళ్లాల్సిందిగా మార్షల్స్‌ను ఆదేశించారు.
ఇక, అంతకు ముందు ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. పెగాసస్ అంశాన్ని ప్రస్తావించారు. పెగాసస్ అంశాన్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుందని తెలిపారు. పెగాసస్‌పై కమిటీ వేసి సుప్రీం దర్యాప్తు చేపట్టిందన్నారు. చంద్రబాబు హయాంలోనే పెగాసస్‌ను వాడారని బెంగాల్ సీఎం చెప్పారని అన్నారు. పెగాసస్ సాప్ట్‌వేర్ ద్వారా ఫోన్లు ట్యాపింగ్ చేసే అవకాశముందన్నారు. పెగాసస్‌పై చర్చించి కమిటీకి రిపోర్ట్ చేయాల్సి బాధ్యత ఉందని మంత్రి అన్నారు.
మరోవైపు పెగాసస్‌పై చర్చకు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నోటీసు ఇచ్చారు. దీంతో స్వల్పకాలిక చర్చ చేపడతామని స్పీకర్ తమ్మినేని తెలిపారు. ఇక, నేడు అసెంబ్లీలో మంత్రులు పలు సవరణ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరపనున్నారు.
