ఏపీ అసెంబ్లీ సమావేశాలు: 14 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్క రోజు పాటు సభ నుండి సస్పెండ్ చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ధరల పెరుగుదల అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు తామిచ్చిన వాయిదా తీర్మానంపై పట్టుబట్టారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ నుండి ఒక్క రోజు పాటు టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం శుక్రవారం నాడు సస్పెండ్ చేశారు.ధరల పెరుగుదల అంశంపై టీడీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు అయితే ఈ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. అయితే ఈ విషయమై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబడ్డారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ సమయంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. ఇరుపక్షాల సభ్యులు గట్టిగా కేకలు వేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు వెల్ లో ఆందోళన చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తప్పు బట్టారు. టీడీపీ సభ్యుల ప్రవర్తన పై మండిపడ్డారు. ప్రతి రోజు సభ సజావుగా కొనసాగకుండా వ్యవహరిస్తున్నారన్నారు. సభలో మీరు మాత్రమే సభ్యులా? ఇతరులు సభ్యులు కాదా? అని ప్రశ్నించారు. సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. టీడీపీ సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని దానికి అనుగుణంగా తాను చర్యలు తీసుకుంటానని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గనను స్పీకర్ కోరారు. ఆ తర్వాత టీడీపీ సభ్యులను సభ నుండి సస్పెండ్ చేస్తూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టారు. దీంతో 14 మంది ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు.
.టీడీపీ ఎమ్మెల్యేలు కింజారపు అచ్చెన్నాయుడు, బెందాళం ఆశోక్, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, డోలా బాల వీరాంజనేయులు, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మకాయల చినరాజప్ప,అనగాని సత్యప్రసాద్, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గణబాబు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్ లను సభ నుండి సస్పుండ్ చేశారు. నిన్న కూడా ఒక్క రోజు పాటు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. పాలనా వికేంద్రీకరణ బిల్లుపై నిన్న చర్చ జరిగింది.ఈ చర్చ సమయంలో రాజధానిలో భూముల కొనుగోలు విషయమై పయ్యావుల కేశవ్ పై అధికార పార్టీ విమర్శలు చేసింది. రాజధాని భూముల ప్రకటన తర్వాతే తాను భూములు కొనుగోలు చేసినట్టుగా కేశవ్ ప్రకటించారు. అయితే రాజధాని ప్రకటన డిసెంబర్ 30వ తేదీన జరిగితే నవంబర్ లోనే కేశవ్ భూములు కొన్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.ఈ విషయమై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కేశవ్ పట్టుబట్టారు.వెల్ లోకి వచ్చి టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. దీంతో టీడీపీ సభ్యులను ఒక్క రోజు పాటు సభ నుండి సస్పెండ్ చేశారు. ఇవాళ ధరల పెరుగుదల అంశంపై ఆందోళన చేయడంతో సభ నుండి సస్పెండ్ చేశారు.