వచ్చే ఎన్నికలతో తెలుగుదేశం పార్టీ కథ సమాప్తమన్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. మూడు సార్లు ప్రజలు అధికారం ఇస్తే పరిపాలించుకోలేని వ్యక్తని చంద్రబాబుపై తమ్మినేని ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్యాలెండర్ ప్రకటించి మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి పనిని జగన్ పూర్తి చేస్తున్నారని సీతారాం ప్రశంసించారు.
టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ (tammineni sitaram) . శ్రీకాకుళంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బాదుడే బాదుడుతో టీడీపీ(TDP) సంగతి ముగుస్తుందని స్పీకర్ జోస్యం చెప్పారు. చంద్రబాబు యాత్రలు అసమర్థుడి అంతిమయాత్ర అని వ్యాఖ్యానించారు. విద్యుత్ ఛార్జీల(Electricity Charges) గురించి చంద్రబాబు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా వుందని తమ్మినేని దుయ్యబట్టారు. బషీర్ బాగ్‌లో పోలీస్ కాల్పులతో(Police Firing) రైతులు మరణానికి కారకుడు చంద్రబాబేనని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును బషీర్ బాగ్ రక్తం మరకలు నేటికి వెంటాడుతున్నాయని స్పీకర్ వ్యాఖ్యానించారు.
ఆరోజు విద్యుత్ ఛార్జీల పెంపుతోనే బషీర్ బాగ్‌లో రైతులు ఉద్యమం చేశారని తమ్మినేని గుర్తుచేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామంటే బట్టలు ఆరబెట్టడానికా అంటూ కామెంట్స్ చేసిన చంద్రబాబు ఇవాళ విద్యుత్ ఛార్జీలపై మాట్లాడుతున్నారని తమ్మినేని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం అవుతుందని స్పీకర్ జోస్యం చెప్పారు. మూడు సార్లు ప్రజలు అధికారం ఇస్తే పరిపాలించుకోలేని వ్యక్తి చంద్రబాబంటూ దుయ్యబట్టారు. అసమర్ధుడుని అందలం ఎక్కిస్తే ఏంజరుగుద్దో చంద్రబాబు హయాంలో ప్రజలకు తెలిసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇచ్చినమాట తప్పకుండా క్యాలెండర్ ప్రకటించి క్లియర్ చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)దని స్పీకర్ ప్రశంసించారు. మ్యానిఫెస్టోని సైతం టీడీపీ సైట్ లోంచి తీసివేసిన వ్యక్తి చంద్రబాబని వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వం బలహీన వర్గాలదని.. గతంలో ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా యాత్ర చేస్తే బస్సులో పెట్టి బాదినట్టున్నారంటూ స్పీకర్ కామెంట్ చేశారు. సీఎం జగన్ కేవలం మూడేళ్లలో చెప్పింది చేసి చూపించారని... మేనిఫెస్టోలో ప్రకటించినవి అన్ని క్లియర్ చేస్తున్నారని కొనియాడారు. ఇవాళ ఎవరు సమర్థుడో ప్రజలకు తెలుసునన్నారు.
