ఎపి అసెంబ్లీలో తీవ్ర గందరగోళం: స్పీకర్ పైకి పేపర్లు విసిరిన టిడిపి ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు బుధవారం నాడు నిరసనకు దిగారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడంపై ఆ పార్టీ సభ్యులు ఆందోళన చేశారు. అయితే ఈ విషయమై బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు మాట్లాడాలని స్పీకర్ సూచించారు. అయినా ఆందోళన కొనసాగించడంతో సభను వాయిదా వేశారు స్పీకర్.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం నాడు టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడంపై టీడీపీ సభ్యులు నిరసన చేపట్టారు.. టీడీపీ సభ్యుల తీరును వైసీపీ తప్పు బట్టింది. వెల్ లోకి వెళ్లి నిరసన తెలపడంపై స్పీకర్ టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ పది నిమిషాల పాటు అసెంబ్లీని వాయిదా వేశారు.
హెల్త్ యూనివర్శిటీ కి ఎన్టీఆర్ పేరును తొలగిస్తూ వైఎస్ఆర్ పేరును పెట్టాలని ఏపీ ప్రభుత్వం తలపెట్టింది.ఈ విషయమై ఇవాళ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనుంది.ఈ విషయమై టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టిన సమయంలో మాట్లాడాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. కానీ టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు. ప్లకార్డులు పట్టుకొని నిరసనకు దిగారు.
ఈ సమయంలో ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. ప్రతి రోజూ సభలో గొడవ చేసి సస్పెండ్ కావాలనేది టీడీపీ సభ్యుల ప్రయత్నంగా కన్పిస్తుందన్నారు. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు వెల్ లోకి వచ్చి నిరసన చేపట్టడం సరైంది కాదన్నారు. అసలు ఎందుకు నిరసన చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. చంద్రబాబునాయుడు టీడీపీ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్నారన్నారు. ఇవాళ త్వరగా టీడీపీ కార్యాలయానికి వెళ్లాలన్న ఉద్దేశ్యంతోనే టీడీపీ సభ్యులు సభలో త్వరగానే నిరసన కార్యక్రమాలు చేపట్టారని ఆయన విమర్శించారు. అసలు ఎందుకు నిరసనకు దిగుతున్నారో చెప్పాలన్నారు.
ఈ సమయంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ఆందోళన చేస్తున్నామని టీడీపీ సభ్యుల వైపు నుండి సమాధానం వచ్చింది. ఎన్టీఆర్ గురించి మాట్లాడే హక్కు టీడీపీ సభ్యులకు లేదన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒక్కరే ఆనాడు ఎన్టీఆర్ వైపు ఉన్నారన్నారు. మిగిలిన వారంతా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని ఆయన గుర్తు చేశారు.
టీడీపీ సభ్యుల తీరును ఏపీ అసెంబ్లీ మాజీ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి తప్పు బట్టారు. వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చిన వైఎస్ఆర్ పేరును హెల్త్ యూనివర్శిటీకి పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 108, 104, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను వైఎస్ఆర్ తీసుకు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరో వైపు అనేక కొత్త మెడికల్ కాలేజీలు కూడా వైఎస్ఆర్ హయంలో వచ్చాయన్నారు. పేదలకు ఎన్టీఆర్ సేవలు చేశారన్నారు. ఎన్టీఆర్ పేరును మరో పథకానికి పెడతామన్నారు.ఇప్పటికే ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరును కూడా పెట్టామని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.
ఏపీ డీప్యూటీ సీఎం నారాయణస్వామి టీడీపీ సభ్యుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. 1999లో చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్టీఆర్ ఫోటోలను తొలగించారన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన విశ్వసఘాతకులు మీరంటూ ఆయన టీడీపీ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం జగన్ ను మీరు ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ సభ్యుల నినాదాలతో సభలో గందరగోళ వాతావరణం నెలకొనడంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
స్పీకర్ పై పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు
వెల్ లో నిలబడి ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులు కొందరు పేపర్లు చింపి స్పీకర్ పై విసిరేశారు. దీంతో ఆగ్రహంతో స్పీకర్ తమ్మినేని సీతారాం తన ఇయర్ ఫోన్స్ తీసి టేబుల్ పై విసిరేశారు. వెంటనే కొందరు మంత్రులు స్పీకర్ కు రక్షణగా వెళ్లారు.దీంతో సభను స్పీకర్ తమ్మినేని సీతారాం సభను వాయిదాను వేస్తున్నట్టుగా ప్రకటించారు.