ఈ నెల 15 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 15వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపనుంది.
అమరావతి: ఈ నెల 15వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునే నిర్వహించే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పని రోజులపై నిర్ణయం తీసుకొంటారు.
ప్రతి ఆరు మాసాలకు ఓసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 24వ తేదీతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆరు మాసాలు పూర్తి కానుంది. దీంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 24వ తేదీ లోపుగానే నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులున్నాయి.దీంతో ఈ నెల 15 నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇవాళ జరిగే కేబినెట్ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన సమాచారంపై ఏపీ గవర్నర్ కు కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్ సమాచారం ఇవ్వనున్నారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల అంశానికి సంబంధించిన బిల్లును కూడా ప్రవేశ పెట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు ఈ ఏడాది మార్చి మాసంలో కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాల నేపథ్యంలో మూడు రాజధానుల రద్దుకు సంబంధించి తీసుకున్న బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే మూడు రాజధానుల బిల్లును తీసుకువస్తామని కూడా సీఎం ప్రకటించారు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను మూడు రాజధానుల అంశాన్ని తీసుకు వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు జరుగుతున్నాయి.ఈ నెల 6వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు నిన్న జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఏపీ అసెంబ్లీ సమావేశాల పనిదినాలపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అంతే కాదు అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై కూడ బీఏసీలో చర్చ జరగనుంది.