అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలైనప్పటినుండి టీడీపీ కావాలని సభను నడవకుండా చేస్తోందని స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్ష పార్టీ తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని.. సభ నిర్వహణకు అస్సలు సహకరించడం లేదని పేర్కొన్నారు. ఐదో రోజు కూడా సభనుండి టీడీపీ సభ్యులను స్పీకర్ బైటికి పంపించారు.
 
ఈ విషయం గురించి స్పీకర్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రతిరోజు ఇలాగే సభను అడ్డుకుని దారుణంగా వ్యవహరిస్తున్నారు. రోజు సస్పెండ్ చేయడం నాకు బాధ కలుగుతోంది. కానీ వాళ్ళ ప్రవర్తనతో నాకు వేరొక ప్రత్యామ్నాయం లేదు. అందుకే ఈ సభలో కొన్ని నిబంధనలు తీసుకు రావాలని అనుకుంటున్నాం. సభను సక్రమంగా నడిపేందుకు ప్రత్యేక నిర్ణయాలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. 

ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పోడియం వద్దకు దూసుకొచ్చిన టీడీపీ సభ్యులను స్పీకర్‌ సభ నుంచి బయటకు పంపించారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే సభలో ఉండరాదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. నేడు సభలో అమూల్‌ (ఆనంద్‌ మిల్క్‌ యూనియన్‌ లిమిటెడ్‌) గురించి చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా హెరిటేజ్ ప్రస్తావన వచ్చింది. ఈ నేపథ్యంలో రైతులకు హెరిటేజ్ చేస్తున్న మోసంపై సమాధానం చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతో బైటకు రావాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని సమాచారం. 

ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు కావాలనే స్పీకర్ పోడియం చుట్టి ముట్టి.. సభలో గొడవ చేసి సస్పెండ్ చేయించుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అమూల్‌ గురించి చర్చ సందర్భంగా సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు కూడా బయటకు వచ్చేయడం గమనార్హం.