మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.. సభకు దూరంగా టీడీపీ..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు మూడో రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు మూడో రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈరోజు ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే శాసనసభలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అసెన్డ్ భూముల క్రమబద్దీకరణ, సమగ్ర భూ సర్వే, చుక్కల భూముల్లో సంస్కరణలు.. మహిళా సాధికారత-రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఏపీలో బుడ్గా జంగం సామాజిక వర్గాన్ని ఎస్సీ జాబితాలో తిరిగి చేర్చాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఇక, ప్రభుత్వం సభలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏపీపీఎస్సీ సవరణ బిల్లు-2023, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లు-2023, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ సవరణ బిల్లు-2023, ఆంధ్రప్రదేశ్ భూదాన్, గ్రామ దాన్ సవరణ బిల్లు-2023, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ సవరణ బిల్లులో అందులో ఉన్నాయి. మరోవైపు శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభం కాగానే.. అక్కడ కూడా ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. అనంతరం పలు కీలక బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
మరోవైపు ప్రతిపక్ష టీడీపీ సభ్యులు సమావేశాలకు దూరంగా ఉన్నారు. గురు, శుక్ర వారాల్లో జరిగిన సమావేశాలకు హాజరైన టీడీపీ సభ్యులు.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై వాయిదా తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దానిని స్పీకర్ తిరస్కరించారు. మరోవైపు శాసనసభలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సభలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. ప్రస్తుత అసెంబ్లీ సెషన్స్‌ని పూర్తిగా బాయ్‌కాట్ చేయాలని టీడీపీ నిర్ణయించిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో తమ హక్కులకు భంగం కలిగించడంతో ఈ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు.